తెలంగాణ సర్కారుకు షాకిచ్చిన‌ హైకోర్టు..స్కూళ్ల రీ ఓపెన్‌పై స్టే!

తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలను రీ ఓపెన్ చేయాల‌ని కేసీఆర్ ప్రభుత్వం అదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి త‌రుణంలో ప్ర‌భుత్వానికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. పాఠశాలల, కళాశాలల పున:‌ప్రారంభంపై స్టే విధిస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో పాఠశాలలను తిరిగి తెరవడానికి వ్యతిరేకంగా గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) పిటీష‌న్‌ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌పై మంగళవారం ఉదయం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా..ప్రత్యక్ష బోధనపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రత్యక్ష విద్యాబోధనకు రావాల్సిందిగా విద్యార్థులను బ‌ల‌వంతం చేయొద్ద‌ని కోర్టు సూచించింది.

లైవ్ క్లాసులకు రాని విద్యార్థులపై మ‌రియు లైవ్ క్లాసులు జరపని విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దు అని ప్రభుత్వానికి హైకోర్టు చెప్పింది. ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే నిర్ణయించుకోవచ్చు అని కోర్టు తెలిపింది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు వారం లోగా మార్గదర్శకాలు జారీ చేయాలని పేర్కొంది. కాగా, వారం త‌ర్వాత మళ్లీ ఈ అంశంపై విచారణ జరిపే అవకాశం ఉంది.