ప‌వ‌న్ స్టామినా ఎంత‌… జ‌న‌సేన టార్గెట్‌గా ఎత్తులు

ఏపీ రాజకీయాల్లో స‌రికొత్త శ‌కం ప్రారంభం కానుంది. ముందు చెప్పుకొన్న ప్ర‌కారం 2014లో ప్రారంభ‌మైన జ‌న‌సేన పార్టీ కార్య‌కలాపాలు ఈ నెల నుంచి పుంజుకోనున్నాయ‌ని తెలుస్తోంది. 2014లోనే ప్ర‌శ్నిస్తానంటూ పొలిటిక‌ల్ అరంగేట్రం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అప్ప‌టి ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు.టీడీపీ-బీజేపీకూట‌మితో జ‌త‌క‌ట్టి వారికి ప్ర‌చారం చేసి పెట్టారు. అదేస‌మ‌యంలో 2019 ఎన్నిక‌ల్లో మాత్రం త‌ప్ప‌కుండా పోటీకి దిగుతామ‌ని అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించారు. 

ఇక‌, ఆ త‌ర్వాత ఏపీ విజ‌భ‌న స‌మ‌స్య‌ల‌పై త‌న‌దైన స్టైల్‌లో గ‌ళం విప్పారు. ప్ర‌త్యేక హోదా బ‌దులుగా ప్యాకేజీ ఇవ్వడం, సీఎం చంద్ర‌బాబు హోదాతో ఏముంది, ప్యాకేజీలో ప‌వ‌రుంద‌ని ప్ర‌క‌టించ‌డంపైనా ప‌వ‌న్ ఫైర్ అయ్యారు. ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూలుగా పేర్కొంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మూడు జిల్లాల్లో బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించి త‌న ఉనికిని చాటుకున్నారు. అనంత‌పురం నుంచి త‌న ప్ర‌స్థానం ప్రారంభ‌మ‌వుతుంద‌ని వెల్ల‌డించారు. అంతేకాకుండా అక్టోబ‌రు నుంచే త‌న ప్ర‌యాణం జోరందుకుంటుంద‌ని చెప్పారు ప‌వ‌న్‌.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. త‌నకంటూ డిఫ‌రెంట్ పాలిటిక్స్ కావాల‌ని ప‌దే ప‌దే ప్ర‌క‌టించే ప‌వ‌న్‌.. ప్ర‌స్తుత ప‌రిస్థిత‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల‌నేది విశ్లేష‌కుల మాట‌. రాష్ట్రంలో విచిత్ర‌మైన రాజ‌కీయ ప‌రిస్థితి నెల‌కొంది. అధికార ప‌క్షంలో సీఎం చంద్ర‌బాబు బాగానే ప‌నిచేస్తున్నా.. అభివృద్ధిలో దూసుకుపోతున్నా.. ఆయ‌న‌పై ఆయ‌న‌కే న‌మ్మ‌కం లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, మంత్రులు, ఎమ్మెల్యేల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు రోజూ వ‌స్తూనే ఉన్నాయి. ఈ ప‌రిస్థితిలో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉంద‌నేది విమ‌ర్శ‌కుల మాట.

ఇక, ఏకైక విప‌క్షంగా ఉన్న వైసీపీలో నాయ‌క‌త్వ లోపం, నియంతృత్వ ధోర‌ణులు స్పష్టంగా క‌నిపిస్తున్నాయి. దీంతో అక్క‌డ విధిలేని ప‌రిస్థితిలోనే కొంద‌రు నేత‌లు నెట్టుకొస్తున్నారు. ఇక‌, కాంగ్రెస్ స‌హా ఇత‌ర పార్టీల్లో నేత‌లు ఏదో చెప్పుకోడానికి ఉన్న‌ట్టుగా మాత్ర‌మే కాలం గ‌డుపుతున్నారు. వీరంతా ప‌వ‌న్ ఎప్పుడు పిలుస్తాడా? అన్న‌ట్టుగా ఎదురు చూస్తున్నారు. ప‌వ‌న్ గేట్లు ఎత్త‌డ‌మే చాలు అన్న‌ట్టుగా నేత‌లు ఎదురు చూస్తున్నారు. మ‌రోప‌క్క‌, పార్టీని బ‌లోపేతం చేయాలంటే.. ప‌వ‌న్‌కి ఎవ‌రినో ఒక‌రిని చేర్చుకోవాల్సిన అవ‌స‌రం అయితే ఉంది. 

ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ పార్టీపై అంచ‌నాలు పెరుగుతున్నాయి. అయితే, ప‌వ‌న్ ఇక్క‌డే జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాల‌నేది విశ్లేష‌కుల మాట‌. కొందరు నాయకులు కావాలనే జనసేనలో చేరి పార్టీ ప్రతిష్టని తగ్గించేందుకు, మిగిలిన పార్టీల ప్రణాళికలో భాగంగా ప‌వ‌న్ పేరును బ‌జారుకు ఈడ్చేందుకు కూడా సిద్ధంగా ఉంటారు.  చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ విషయంలో వైఎస్ అమలు చేసిన ప్రణాళిక..  ఆ పార్టీని చిత్తు చేసింది. ఇప్పుడు కూడా ప‌వ‌న్‌కు ఇలాంటి అనుభ‌వాలు ఎదురు కావ‌ని చెప్ప‌లేం. కాబ‌ట్టి.. జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తేనే.. ప‌వ‌న్ పొలిటిక‌ల్ జ‌ర్నీ సామ‌ర‌స్యంగా సాగేది!!