బీజేపీ లీడ‌ర్‌తో జ‌గ‌న్‌కు సీక్రెట్ మీటింగ్‌..!ఏపీ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్‌

ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక‌కు ముందు వ‌ర‌కు రాజ‌కీయంగా ఒక్క‌డే పెద్ద చ‌ర్చ జ‌రిగింది. వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ బీజేపీతో పొత్త అంశం రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు రేపింది. నంద్యాల ఉప ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఏపీలో టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహోరీగా పోటీ ఉంటుంద‌ని అంద‌రూ ఆశించారు. నంద్యాల ఉప ఎన్నిక‌తో పాటు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో చాలా మంది న్యూట్ర‌ల్ ప‌ర్స‌న్స్ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇదిలా ఉంటే నంద్యాల ఉప ఎన్నికకు ముందు జ‌గ‌న్ మోడీని క‌ల‌వ‌డంతో పాటు టీడీపీకి-బీజేపీకి మ‌ధ్య ఉన్న గ్యాప్ నేప‌థ్యంలో జ‌గ‌న్ బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతున్న ప‌రిస్థితి కూడా క‌నిపించింది. నంద్యాల ఉప ఎన్నికకు ముందు టీడీపీతో పొత్తుపై డ‌బుల్ గేమ్ ప్లే చేసిన బీజేపీ ఆ ఉప ఎన్నిక ఫ‌లితం త‌ర్వాత యూ ట‌ర్న్ తీసుకుని తాము వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతోనే క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ‌తామ‌ని ప్ర‌క‌టించింది. 

ఇదిలా ఉంటే బీజేపీ టీడీపీతోనే క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ‌తామ‌ని ప్ర‌క‌టించాక కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ బీజేపీతో పొత్తుపై ఆశ‌లు వ‌దులుకున్న‌ట్టు లేదు. తాజాగా జ‌గ‌న్ రెండు రోజుల క్రితం ఏపీకి చెందిన ఓ బీజేపీ ఎంపీ కుమారుడి ఇంట్లో చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌ద‌రు ఎంపీ కుమారుడు రాజ‌కీయంగా పెద్ద‌గా యాక్టివ్‌గా లేక‌పోయినా బీజేపీకి చెందిన అనుబంధ సంస్థలు ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ లాంటి సంస్థల వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తుంటారు. 

జ‌గ‌న్ స‌ద‌రు బీజేపీ ఎంపీ కుమారుడి ఇంట్లో ఏకంగా రెండు గంట‌లకు పైగా ఉన్నారు. అక్క‌డ హిందు సంస్థలైన ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ నేతల‌తో జ‌గ‌న్ వివిధ అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు కూడా విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. జ‌గ‌న్ త్వ‌ర‌లోనే పాద‌యాత్ర‌కు రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ ప్ర‌తి శుక్ర‌వారం కోర్డుకు హాజ‌రు కావాల్సి ఉంది. అయితే ఇప్ప‌టికిప్పుడు త‌న పాద‌యాత్ర‌కు బ్రేకులు లేకుండా కోర్టుకు హాజ‌ర‌య్యే విష‌యంలో మిన‌హాయింపులు ఇవ్వాల‌ని త‌న‌కు కేంద్రం స‌హ‌క‌రించేలా ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ నేతలను జగన్ కోరినట్లు సమాచారం. 

ఇక బీజేపీతో తాను ఎప్పుడూ విబేధించ‌లేద‌న్న విష‌యాన్ని కూడా జ‌గ‌న్ వారితో ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. 

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తెలిపిన విషయాన్ని జగన్ వారికి వివరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అడిగినన్ని సీట్లు ఇస్తామని, అన్నీ విధాలుగా సహకరిస్తామని పొత్తుకు బంప‌ర్ డీల్ జ‌గ‌న్ ఇచ్చార‌ని టాక్‌. ఏదేమైనా జ‌గ‌న్ బీజేపీకి ఇచ్చిన భారీ డీల్‌తో ఏపీ రాజ‌కీయాలు మ‌ళ్లీ ర‌స‌కందాయంలో ప‌డ్డాయి.