కేంద్ర కేబినెట్ నుంచి ఆ టీడీపీ మంత్రి అవుట్‌..!

కేంద్రంలో స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ అధిష్టానం+ప్ర‌ధాని న‌రేంద్ర మోడీలు 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే దిశ‌గా స‌రికొత్తగా పావులు క‌దుపుతున్నారు. ఇప్పుడున్న మిత్ర ప‌క్షాల బ‌లాబ‌లాల‌ను అంచ‌నా వేయ‌డంతోపాటు.. కొత్త‌వారిని చేర్చుకుని బ‌లోపేతం అయ్యేందుకు ఆ ర‌కంగా మ‌ళ్లీ హ‌స్తిన‌లో సీటును కైవ‌సం చేసుకునేందుకు మోడీ, షా ధ్వ‌యం ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు ప్రారంభించేశారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం త‌మ‌కు మిత్రులుగా ఎన్‌డీయేలో ఉన్న పార్టీల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచే స‌త్తా ఉందా? లేదా? అన్న‌ది చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బ‌లంలేని పార్టీల‌కు ఇప్ప‌టి నుంచే చెక్ పెట్టాల‌ని వ్యూహం సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో ఏపీ నుంచి త‌మ‌కు బ‌ల‌మైన మిత్ర ప‌క్షంగా ఉన్న టీడీపీకి ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఒకింత వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని మోడీ, షాల‌కు “కొంద‌రు“ ఉప్పందించారు. కాపు రిజ‌ర్వేష‌న్‌, ఆక్వా ప‌రిశ్ర‌మ‌, నిరుద్యోగుల వ్య‌వ‌హారం, నెర‌వేర‌ని బాబు హామీల‌తో పాటు.. జ‌గ‌న్ చాప‌కింద నీరులా పుంజుకుంటున్న విష‌యాన్నీ ఢిల్లీ కి చేర‌వేశారు. దీంతో మోడీ, షాలు.. ఇక 2019 నాటికి బాబుతో అంట‌కాగితే.. తాము కూడా మునిగిపోవ‌డం ఖాయ‌మ‌ని గుర్తించిన‌ట్టు తెలిసింది. అయితే, ఉన్న‌ట్టుండి ఈ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌డం కూడా స‌బ‌బు కాద‌ని, ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న ప్ర‌భుత్వంలో తాము కూడా సీట్లు పంచుకుని మంత్రులుగా చ‌లామ‌ణి అవుతున్నందున నొప్పి తెలియ‌కుండా వాత పెట్టి.. బాబు త‌నంత‌ట తానే వెళ్లిపోయేలా ప్లాన్ రెడీ చేసుకున్నార‌ట‌.

ఈ ప్లాన్‌లో భాగంగా.. త్వ‌ర‌లోనే విస్త‌రించ‌నున్న కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీకి చెందిన మంత్రి సుజ‌నాను త‌ప్పించి.. త‌ద్వారా బాబుకు షాక్ ఇవ్వాల‌ని మోడీ డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. దీనిద్వారా చంద్ర‌బాబు అస‌లు విష‌యం గుర్తించి.. త‌న దారి తాను చూసుకుంటాడ‌ని, దీంతో పొమ్మ‌న కుండానే బాబుకు పొగ‌బెట్టిన‌ట్ట‌వుతుంద‌ని కూడా మోడీ భావిస్తున్న‌ట్టు తెలిసింది. అయితే, సుజ‌నానే ఎందుకు? అని అంటే.. ఆయ‌న పెర‌ఫార్మెన్స్‌పై మోడీ అంత సంతృప్తిగా లేడ‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఎంత‌సేపూ.. ఏపీ గురించే త‌ప్ప కేంద్రం మంత్రిగా ఆయ‌న దేశానికి ఏం చేశారో చెప్ప‌మంటే.. చెప్పే ప‌రిస్థితిలో సుజ‌నా లేడ‌నేది ఢిల్లీ వ‌ర్గాల అభిప్రాయంగా ఉంది. ఈ క్ర‌మంలోనే సుజ‌నాను సాగ‌నంపడం వ‌ల్ల ప‌నిచేయ‌ని మంత్రుల‌కు హెచ్చ‌రికగా కూడా త‌మ ప్లాన్ ప‌నికి వ‌స్తుంద‌ని మోడీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఇదే జ‌రిగితే.. ఏపీలో చంద్ర‌బాబుకు పెద్ద కుదుపు త‌ప్ప‌ద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. అయితే, బాబు.. ప‌వ‌న్‌తో జ‌ట్టు క‌ట్టే యోచ‌న‌లో ఉండ‌డం వ‌ల్ల దీనిని లైట్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంద‌ని చెబుతున్నారు. మోడీ షాట్‌కి మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.