నంద్యాల టీడీపీలో ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశారా..?

నంద్యాల‌లో యాక్టివ్ పాలిటిక్స్‌లో చురుగ్గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఇప్ప‌డు అత్యంత కీల‌క‌మైన స‌మ‌యంలో రాజ‌కీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయ‌నంత‌ట ఆయ‌నే టీడీపీకి దూర‌మ‌య్యారా? లేక పార్టీ అధినేత చంద్ర‌బాబే ఆయ‌న‌ను కావాల‌ని ప‌క్క‌న పెట్టేశారా? అంటే ప‌క్క‌న పెట్టేశార‌నే అంటున్నారు స్థానిక తెలుగు త‌మ్ముళ్లు. దీనికి సుబ్బారెడ్డి స్వ‌యంకృత‌మే కార‌ణంగా చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఏవీ సుబ్బారెడ్డికి ప్ర‌స్తుతం ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన భూమా వ‌ర్గానికి బంధుత్వం ఉంది. వీరంతా గ‌తంలో టీడీపీలోనే ఉండేవారు. అయితే, నాగిరెడ్డి మాత్రం త‌ర్వాత వివిధ పార్టీలు మారి చ‌నిపోయే ముందు టీడీపీలో చేరారు.

ఇక‌, నాగిరెడ్డి మ‌ర‌ణంతో పొలిటిక‌ల్‌గా దూసుకువ‌చ్చిన ఆయ‌న కూతురు భూమా అఖిల ప్రియ మంత్రి సీటు సాధించారు. ఇక‌, సుబ్బారెడ్డికి, అఖిల ప్రియ‌కు మ‌ధ్య ఆస్తుల‌కు సంబంధించి ఘ‌ర్ష‌ణ‌లు సైతం ప్రారంభ‌మ‌య్యాయి. అఖిలప్రియ మంత్రి అయ్యాకా.. ఈ విబేధాలు మరింత ముదిరాయి. సుబ్బారెడ్డిని అఖిల లెక్క‌చేయ‌డం లేద‌నే టాక్ కూడా వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఇరువురి మ‌ధ్య విభేదాలు తార‌స్థాయికి చేరాయి. దీంతో అఖిల‌కు గ‌ట్టి షాక్ ఇవ్వాల‌ని భావించాడు సుబ్బారెడ్డి. ఈ క్ర‌మంలోనే నంద్యాల ఉప ఎన్నిక రావ‌డంతో దానిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని అఖిల‌ను కాళ్ల బేరానికి తెచ్చుకోవాల‌ని భావించాడు.

ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో సైలెంట్ అయిపోయాడు. విష‌యం తెలిసిన చంద్ర‌బాబు.. అఖిల‌, సుబ్బారెడ్డిల‌ను కూర్చోబెట్టి మంత్రాంగం నెరిపి స‌ర్దుకు పోవాల‌ని సూచించారు. అయితే, ఇది క్షేత్ర‌స్థాయిలో వ‌ర్క‌వుట్ కాలేదు. అందరూ తనను వాడుకునే వారే తప్ప.. తనకు విలువనిచ్చేవారు లేరని సుబ్బారెడ్డి బ‌లంగా నిర్ణ‌యించుకున్నాడు. దీంతో నంద్యాల ఉప పోరు మొదలయ్యాక‌.. సుబ్బారెడ్డి ప్రచారం అయితే మొదలుపెట్టాడు కానీ, ఈయన భూమా వారసులతో కలవలేదు. తన మటుకు తాను ప్రచారం చేసుకొంటూ పోయాడు. ఈ నేపథ్యంలో బ్ర‌హ్మానంద రెడ్డి నామినేషన్ కార్యక్రమం రోజున కూడా సుబ్బారెడ్డిని పిలవలేదు.

దీంతో ఇక సుబ్బారెడ్డి పూర్తిగా టీడీపీకి ప్ర‌చారం ఆపేయాల‌ని డిసైడ్ అయ్యాడు. దీంతో విష‌యం తెలిసిన చంద్ర‌బాబు కూడాఈ స‌మ‌యంలో ఈ విష‌యాన్ని మ‌రింత పెద్ద‌ది చేస్తే.. శిల్పా బ్ర‌ద‌ర్స్ ప‌రిస్తితి ఎదురైనా ఎద‌ర‌వ‌వ‌చ్చ‌ని భావించి సైలెంట్ అయిపోయారు. సో.. ప్ర‌స్తుతం సుబ్బారెడ్డి దాదాపు టీడీపీకి దూరం అయి పోయార‌నే టాక్ న‌డుస్తోంది. మ‌రి భ‌విష్య‌త్తులో సుబ్బారెడ్డి ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటాడో చూడాలి. ఇక‌, స్థానికంగా సుబ్బారెడ్డికి కొంత ప‌లుకుబ‌డి ఉండ‌డంతో వీరు బ్ర‌హ్మానంద రెడ్డికి ఓట్లు వేస్తారా? లేదా? అన్న‌ది చూడాలి.