టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి, దందాల భాగోతం ఆగ‌దా..!

అవినీతి స‌హించేది లేదు. భ‌రించేది లేదు అని ప‌దే ప‌దే చెప్పుకొచ్చే టీడీపీలో నే ఇప్పుడు అవినీతి కంపు భారీ ఎత్తున క‌మ్మేస్తోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు అవినీతిని తుద‌ముట్టిస్తాన‌ని ప్ర‌క‌టిస్తూ ఉంటే.. ఆ పార్టీ కి చెందిన నేత‌లు . మాత్రం అవినీతికి ఒంట‌బ‌ట్టించుకోవ‌డంలో ముందంజ‌లో ఉన్నారు. ఇటీవ‌లే ఎమ్మెల్సీ వాకాటి నారాయ‌ణ రావు, దీప‌క్ రెడ్డిల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌డం వారిని ప్ర‌శ్నించ‌డం తెలిసిందే. దీంతో టీడీపీ ప‌రువు అప్ప‌ట్లోనే భారీగా దెబ్బ‌తింది.

ఇక‌, ఇప్పుడు తాజాగా ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు రాష్ట్రాన్ని క‌మ్మేశాయి. వారిలో ఒక‌రు అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ కాగా, మ‌రొక‌రు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు. ఈ ఇద్ద‌రి వ్య‌వ‌హారం చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించింది. విశాఖ భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు చేపట్టాక ప్రజల నుంచి ఫిర్యాదులు పుంఖాను పుంఖాలుగా అందాయి.

వీటన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పై తొలిసారి భూ ఆక్రమణ కేసు నమోదయింది. ఎమ్మెల్యే పీలా గోవింద్ అతని అనుచరులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని తహసిల్దార్ చేసిన ఫిర్యాదుతో అధికారులు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక‌, ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మహారాష్ట్రలోని విదర్భ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గతంలో జరిగిన కాలువ నిర్మాణాలు – మరమ్మతులు – ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులు చేసిన ఆయ‌న‌కు చెందిన కంపెనీ పలు అవకతవకలకు పాల్పడినట్లు మహారాష్ట్ర ఏసీబీ గుర్తించింది.దీంతో ఆయనపై నాగపూర్ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి నిందితుడిగా చేర్చారు.

ఆయ‌న అంచనాకు మించిన ప్రతిపాదనలతో కోట్ల రూపాయలు స్వాహా చేశారంటూ మిగిలిన నిందితులపైనా ఏసీబీ అభియోగాలు నమోదు చేసింది. కాగా ఏపీతో పాటు తెలంగాణ – మహారాష్ట్ర – కర్నాటకలోని రామారావు ఆస్తులపైనా అధికారులు ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సో.. ఇప్పుడు చంద్ర‌బాబు ఏం చేస్తార‌ని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఆ ఇద్ద‌రు ఎమ్మెల్సీల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్టుగా ? వీరిని కూడా చేస్తారా ? లేదా ? అన్న‌ది చూడాలి.

a