రోజా నోటీ దూల మానుకోదా..!

వైసీపీ లేడీ ఫైర్ బ్రాండ్ రోజా మ‌రో సారి నోరు పారేసుకున్నారు. ఏకంగా అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ల‌క్ష్యంగా ఆమె కామెంట్లు కుమ్మ‌రించారు. స్పీక‌ర్ ప‌ద‌విని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని విరుచుకుప‌డ్డారు. దీంతో సీరియ‌స్ అయిన కోడెల మ‌రోసారి రోజాకు నోటీసులు పంపించాల‌ని డిసైడ్ అయ్యారు. ఇప్ప‌టికే ఏడాది పాటు స‌భ‌ల నుంచి స‌స్పెండ్ అయిన రోజాకి.. ఇప్పుడు మ‌ళ్లీ నోటీసులు అంటే.. మ‌రో సారి మ‌రింత గ‌ట్టి షాక్ త‌గ‌ల‌డ‌మే అంటున్నారు విశ్లేష‌కులు. విష‌యంలోకి వెళ్తే..

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంగా అమ‌రావ‌తిలో అధికార తెలుగు దేశం పార్టీ మాక్ పోలింగ్ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి స్పీక‌ర్ కోడెల కూడా వ‌చ్చారు. అయితే, ఆయ‌న రాక‌ను ఎమ్మెల్యే రోజా తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. స్పీక‌ర్ వ్య‌వ‌స్థ‌తోపాటు, ఆ స్థానానికి ఉన్న గౌర‌వాన్ని దిగ‌జార్చే విధంగా కోడెల వ్య‌వ‌హ‌రించారంటూ ఆమె విమ‌ర్శించారు. స‌భాప‌తి స్థానంలో ఉన్న వ్య‌క్తి, ఇలా పార్టీ నేత‌ల‌తో వ‌చ్చి ఓటింగ్ చేయ‌డం స‌రికాద‌న్నారు.

టీడీపీ ఎమ్మెల్యేగా ఆయ‌న వ్య‌వ‌హరించ‌డం బాధాక‌రమనీ, స్పీక‌ర్ బ‌య‌ట కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న స‌మ‌యంలో కూడా పార్టీ కండువాలు వేసుకుంటార‌నీ, పార్టీ క్యాబినెట్ మీటింగుల్లో పాల్గొంటార‌నీ, ఈరోజు మాక్ ఎన్నిక స‌మ‌యంలో ఇత‌ర టీడీపీ ఎమ్మెల్యేల‌తో రావ‌డం క‌రెక్ట్ కాద‌ని విమ‌ర్శించారు. ఇలా దిగ‌జారి స్పీక‌ర్ ప‌ద‌వికి గౌర‌వం లేకుండా చేయ‌డ‌మ‌నేది స‌రికాదని రోజా అన్నారు.

దీనిని స్పీక‌ర్ కోడెల సీరియ‌స్‌గా తీసుకున్నారు. త‌క్ష‌ణ‌మే రోజాకు నోటీసులు జారీ చేయాల‌ని అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి ఆదేశాలు పంపిన‌ట్టు స‌మాచారం. ఇదే జ‌రిగి.. రోజాపై చ‌ర్య‌లు తీసుకుంటే మ‌రోసారి ఆమె అసెంబ్లీకి దూరంగా ఉండాల్సి రావ‌డం ఖాయం. ఇక‌, రోజా విష‌యంలో ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆమె ఇక మార‌దా అని సొంత పార్టీలోనే నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఇప్ప‌టికే చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు ఏడాది స‌స్పెండ్ అయినా ప‌రిస్థితిలో మార్పు రాలేద‌ని ఇలా అయితే భ‌విష్య‌త్తులో మ‌రింత క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. మ‌రి రోజా ఇక‌నైనా మారుతుందో లేదో చూడాలి .