ఏపీ బీజేపీలో ఇప్పుడు అందరూ ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. బీజేపీకి పెద్దతలకాయ మాదిరిగా ఉంటున్న వెంకయ్యనాయుడును ప్రధాని నరేంద్ర మోదీ , బీజేపీ సారధి అమిత్ షాల ధ్వయం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో వెంకయ్య ఇక ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టే పరిస్థితి పూర్తిగా లేనట్టే. అయితే, 2019 నాటికి ఏపీలో స్ట్రాంగ్ అవ్వాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానానికి వెంకయ్య లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించడం ఖాయం.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఈ పరిస్థితి మరింత దారుణం. ఇక్కడి నేతలు అందరిలో దాదాపు సగానికిపైగా వెంకయ్య అండదండలతో రాజకీయ పాఠాలు నేర్చుకున్నవారే. అలాంటి వారికి వెంకయ్య అన్నీ తానై వెనకుండి నడిపిస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే.. ఏపీలో వెంకయ్య అవసరం బీజేపీకి ఎంతో ఉంది. కానీ అధిష్టానం మాత్రం ఆయనను ఉపరాష్ట్రపతిగా నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ పరిస్థితి ఏంటో చూద్దాం.
ఏపీలో బీజేపీని ఒంటి చేత్తో నడిపిస్తున్న ఏకైక నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు. విద్యార్థి దశ నుంచి ఆర్ ఎస్ ఎస్‌తో సంబంధాలున్న ఆయన బీజేపీలో అంచలంచెలుగా ఎదిగారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పార్టీ ని నడిపించారు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. 2014లో బీజేపీ, చంద్రబాబులు పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన ఏపీకి అన్నీ తానై నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా మొదలు ప్యాకేజీ విషయంలోనూ వెంకయ్య తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన ఢిల్లీలో అన్ని విధాలా సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య ఉపరాష్ట్రపతి అయితే, ఢిల్లీలో ఏపీ గురించి బలమైన వాణి వినిపించే వారు ఉండరనేది నిజం. ఇక, ఏపీ బీజేపీ విషయానికి వస్తే.. ఆ పార్టీకి ఏపీలో దిక్కెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక్కడ బీజేపీకి మొదటి నుంచి అన్నీ తానై వెంకయ్య వ్యవహరిస్తున్నారు.
ఏదైనా గొడవలు వచ్చినా.. నేతల మధ్య సమన్వయం కొరవడినా పరిష్కరిస్తూ మార్గదర్శనం చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు వెంకయ్య ఢిల్లీకే పరిమితం అయిపోతే.. ఏపీలో బీజేపీకి దిశానిర్దేశం చేసేవారు కరువవుతారనడంలో సందేహం లేదు. మరి బీజేపీ అధిష్టానం ఎలాంటి వ్యూహంతో ఈ ప్రణాళికను అమలు చేస్తోందో చూడాలి.