డ్ర‌గ్స్ రాకెట్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల వార‌సులు

హైదరాబాద్ కేంద్రంగా బయటకొస్తున్న డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఎలా కుదుపుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ షాకుల నుంచి బ‌య‌ట‌కు రాకుండానే ఇప్పుడు ఈ డ్ర‌గ్స్ మాఫియాకు ఏపీలోని కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల కుమారుల‌కు లింకులు ఉన్న‌ట్టు వ‌స్తోన్న వార్త‌లు పెద్ద ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఈ మాఫియాలో ప్ర‌ధాన సూత్ర‌ధారిగా అంద‌రూ అనుమానిస్తోన్న కెల్విన్ ప‌లువురి రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు వారి పుత్ర‌ర‌త్నాల పేర్లు కూడా బ‌య‌ట పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

కెల్విన్ సెల్‌ఫోన్‌తో పాటు అత‌డి వాట్సాప్ గ్రూపులో ఉన్న నెంబ‌ర్ల‌ను చూస్తే కెల్విన్ మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా రాజ‌కీయ నేత‌ల కుమారులకు కూడా మ‌త్తు మందులు పంపిణీ చేసిన‌ట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నలుగురైదుగురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొంత‌మంది కార్పొరేష‌న్ల చైర్మ‌న్ల పిల్ల‌లు డ్ర‌గ్స్ మ‌త్తులో జోగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ వార‌సుల్లో కొంద‌రికి నేరుగా మ‌రికొంద‌రికి మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా కెల్విన్ మ‌త్తు మందులు పంపిణీ చేసేవాడ‌ట‌.

హైద‌రాబాద్ స‌మీప ప్రాంతాలు అయిన మెయినాబాద్, శంషాబాద్, మేడ్చల్, శామీర్ పేట్, ఘట్‌కేస‌ర్ ప్రాంతాల్లో రిసార్టుల‌ను ఎంపిక చేసుకుని అక్క‌డ‌కు వ‌చ్చే రాజ‌కీయ నేత‌ల వార‌సుల‌కు ఈ మత్తు మందును అందిస్తున్నట్లు కెల్విన్ చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇక తెలంగాణ‌లో కొంద‌రు ఎమ్మెల్యేల త‌న‌యులు కూడా ఈ మ‌త్తులో జోగుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఏపీకీ చెందిన ఓ రాజ‌కీయ నేత కుమారుడు ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాలైన సంగ‌తి తెలిసిందే. ఈ సంఘ‌ట‌న వెన‌క కూడా డ్ర‌గ్స్ ప్ర‌భావం ఉన్న‌ట్టు సందేహాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటోన్న ఇద్ద‌రు వార‌సుల‌తో పాటు గతంలో వివాదాల్లో చిక్కుకున్న ఓ ఏపీ మంత్రి కుమారుడు కూడా డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు కెల్విన్ ద్వారా వెల్లడైనట్లు తెలుస్తోంది.

ఇక కొద్ది రోజుల క్రితం ఏపీలో పార్టీ మారిన ద‌క్షిణ కోస్తాకు చెందిన ఓ సీనియ‌ర్ లీడ‌ర్ కూడా డ్ర‌గ్స్ స‌ప్ల‌య్ చేస్తాడ‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో టాక్ న‌డుస్తోంది. ఏదేమైనా డ్ర‌గ్స్ ఇష్యూలో నిన్న‌టి వ‌ర‌కు సినీ ప్ర‌ముఖుల పేర్లే వినిపిస్తే ఇప్పుడు రాజ‌కీయ వార‌సుల పేర్లు కూడా బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డం మ‌రిన్ని సంచ‌ల‌నాలు బ‌య‌ట‌కు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.