ఏ ఎమ్మెల్యే అయినా మంత్రి పదవికోసం ముఖ్యమంత్రి నమ్ముకుంటారు. ముఖ్యమంత్రిని నమ్ముకున్న వాళ్లకు మంత్రి పదవి వస్తుంది. కానీ తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే పూజలను నమ్ముకుని అడ్డంగా బుక్ అయ్యాడు. పూజలను నమ్ముకుని బుక్ అవ్వడం ఏంటన్న షాక్‌లో కూడా మనం ఉంటాం. అసలు మ్యాటర్ ఏంటంటే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు.
ఆయన పార్టీ మారినప్పటి నుంచి మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నా ఆయన కన్నా ఎంతోమంది సీనియర్లు ఉండడంతో కేసీఆర్ ధర్మారెడ్డి పేరును అస్సలు పరిగణలోకి కూడా తీసుకోలేదు. ఆయన పూజలు చేయిస్తే మంత్రి పదవి వస్తుందని బలంగా నమ్మారు. ఇందుకోసం కోయదొరలతో పూజలు చేయించారు. తీరా ఇప్పుడు పూజలు చేశాక మంత్రి పదవి రాలేదు సరికదా.. ఉన్న డబ్బూ ఊడ్చిపెట్టుకు పోయింది.
మంత్రాలకు చింతకాయలు రాలతాయన్నది ఎవరో చుదువు రాని వ్యక్తి నమ్మాడంటే పెద్ద ఆశ్చర్యం ఉండదు. కాని లక్షల మందికి ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలా పూజలు చేస్తే మంత్రి పదవి వస్తుందని నమ్మిపోసపోవడం నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. ఇక జిల్లాలో కడియం శ్రీహరి, చందూలాల్ మంత్రులుగా ఉండగా, మధుసూదనాచారి స్పీకర్ గా ఉన్నారు. వరంగల్ జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందని ధర్మారెడ్డికి టీఆర్ఎస్‌లో ఎవరో చెప్పారట.
దీంతో వెంటనే ఆ మంత్రి పదవి తనకే దక్కాలని ఆయన ఎవరినో ఆశ్రయించారట. వారు మీకు గ్రహదోషం పట్టుకుంది… ఆ దోషం పోతేనే మంత్రి పదవి వస్తుందని చెప్పడంతో ఇప్పటి వరకు ఆయన కోయ దొరలకు ఏకంగా రూ. 57 లక్షల వరకు సమర్పించుకున్నారట. అరకోటికి పైగా చేతి చమురు వదిలాక కాని ఆయనకు తాను మోసపోయానన్న అసలు విషయం అర్థంకాలేదట.
చివరకు ఆయన పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ విషయాన్ని గుట్టుగా ఉంచినా ఆ మ్యాటర్ మాత్రం ఆ నోటా, ఈ నోటా లీక్ అయ్యింది. ఇక్కడ ఎమ్మెల్యే వెర్షన్ తాను మంత్రి పదవి కోసం పూజలు చేయించలేదని, అనారోగ్యంతో ఉన్నందునే పూజలు చేయించినట్టు చెపుతున్నారు. ఇక ఎమ్మెల్యేకు పూజలు చేసిన కోయదొరలను పోలీసులు విచారించగా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పూజలు చేయించినట్టు చెప్పారట.