కృష్ణా జిల్లాకు న‌లుగురు కొత్త ఎమ్మెల్యేలు

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశం స్పీడ్ అందుకుంద‌ని వార్త‌లు రావ‌డంతో ఏపీలో వివిధ పార్టీల ఆశావాహుల్లో ఎక్కడా లేని ఫుల్ జోష్ క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఇప్పుడు 225 కానున్నాయి. ఈ లెక్క‌న చూస్తే ఒక్కో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం పరిధిలో ప్రస్తుతం ఉన్న 7 ఎమ్మెల్యే సీట్లు ఇప్పుడు 9 కానున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ రాజ‌ధాని కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో సైతం నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో నాలుగు కొత్త అసెంబ్లీ సీట్లు పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

జిల్లా యూనిట్‌గా తీసుకుంటే కృష్ణాలో 5 సీట్లు ఎలాగూ పెరుగుతాయి. అయితే లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌ను యూనిట్‌గా తీసుకుంటే 4 సీట్లు ఖ‌చ్చితంగా పెరుగుతాయి. ఇక ఐదో సీటును ఎలా పెంచుతారు ? అన్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు స‌స్పెన్సే. జిల్లాలో విజ‌య‌వాడ‌, మ‌చిలీప‌ట్నం రెండు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఇక నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే విజ‌య‌వాడ లోక్‌స‌భ ప‌రిధిలో మ‌రో రెండు కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు రానున్నాయి.

విజ‌య‌వాడ అర్బ‌న్‌లో మ‌రో సీటు – విజ‌య‌వాడ రూర‌ల్ – ఇబ్ర‌హీంప‌ట్నం ఈ మూడు నియోజ‌క‌వర్గాల్లో ఏవైనా రెండు కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు రానున్నాయి. ఇక మ‌చిలీప‌ట్నం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో చ‌ల్ల‌ప‌ల్లి, గుడ్ల‌వ‌ల్లేరు కేంద్రాలుగా కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు ఏర్పాడ‌తాయ‌ని తెలుస్తోంది.

ఇక జిల్లాలోని నూజివీడు, కైక‌లూరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్నాయి. మ‌రి ఈ రెండు నియోజ‌వ‌ర్గాల‌ను చీల‌దీసి కొత్త నియోజ‌క‌వ‌ర్గం ఏర్పాటు చేయ‌డం కుద‌ర‌దు. దీంతో జిల్లాలో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా విభ‌జ‌న చేస్తే ఐదో సీటు ఏర్పాటు మాత్రం కాస్ప సస్పెన్స్‌గానే ఉంటుంది.

ఇక కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు ఏర్పాటు చేస్తే జిల్లాలో మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ప్ర‌స్తుతం ఉన్న 16 సీట్ల‌కు తోడు ఇప్పుడు కొత్త‌గా మ‌రో 4 నియోజ‌క‌వ‌ర్గాలు రానున్నాయి. ఇక గ‌తంలో పున‌ర్విభ‌జ‌న జ‌రిగిన‌ప్పుడు నిడుమోలు (ఎస్సీ), ముదినేప‌ల్లి, ఉయ్యూరు, బంటుమిల్లి నియోజ‌క‌వ‌ర్గాలు ర‌ద్ద‌య్యి వాటి స్థానంలో పెన‌మ‌లూరు, విజ‌య‌వాడ తూర్పు, పామ‌ర్రు (ఎస్సీ) స్థానాలు రాగా ఓ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం కోల్పోవాల్సి వ‌చ్చింది. ఇక ఇప్పుడు ప్ర‌స్తుతం ఉన్న 16కు తోడు మ‌రో 4 కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు రావ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీల నుంచి ఆశావాహులు అప్పుడే స్కెచ్‌లు వేస్తున్నారు.