తెలంగాణ‌లో ట్రెండ్ సెట్ చేస్తోన్న ఐఏఎస్‌, ఐపీఎస్ దంప‌తులు

తెలంగాణలో ప్రస్తుతం అకున్ స‌బ‌ర్వాల్ పేరు చెపితే అక్ర‌మార్కుల గుండెళ్లో రైళ్లు ప‌రిగెట్టేస్తున్నాయి. టాలీవుడ్‌లో వేళ్లూనుకుపోయిన డ్ర‌గ్ మాఫియాను కూక‌టివేళ్ల‌తో పెక‌లించిన ఆయ‌న ఇప్పుడు ఇక్క‌డ పెద్ద పెద్ద వాళ్ల‌కు సైతం చెమ‌ట‌లు ప‌ట్టించేస్తున్నాడు. అక్క‌డ మ‌త్తులో మునిగితేలుతోన్న వారిని చిత్తు చేస్తూ వారి మ‌త్తు వ‌దిలిస్తున్నారు. టాలీవుడ్‌కు ప‌ట్టిన మ‌త్తును వ‌దిలిస్తోన్న స‌బ‌ర్వాల్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది.

ఇదిలా ఉంటే తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న లేడీ ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌లో స్మిత స‌బ‌ర్వాల్ ఒక‌రు. 2001లో ట్రైనీ క‌లెక్ట‌ర్‌గా ఐఏఎస్ విధుల్లో చేరిన ఆమె అకున్ స‌బ‌ర్వాల్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రు భార్య భ‌ర్త‌లు అన్న విష‌యం చాలామందికి తెలియ‌దు. క‌లెక్ట‌ర్‌గా ఆమె స‌మ‌ర్థ‌త‌ను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆమెను స్వ‌యంగా త‌న కార్యాల‌యంలో అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా నియ‌మించుకున్నారు. ఆమె ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో కీల‌క‌వ్య‌క్తిగా, కేసీఆర్‌కు ఎంతో న‌మ్మ‌క‌మైన వ్య‌క్తిగా మారారు.

స్మిత గ్రాడ్యుయేష‌న్ విద్య కూడా హైద‌రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్‌లో పూర్తి చేశారు. మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్‌గా ఆమె ఎన్నో సంచ‌ల‌న ప‌నుల‌కు కేంద్ర బిందువుగా మారారు. ఆ త‌ర్వాత ఆమె క‌డ‌ప‌, క‌ర్నూలు, విశాఖ‌ప‌ట్నం, చిత్తూరు జిల్లాల్లో ప‌నిచేశారు. ఆమె తెలుగు, బెంగాల్‌, ఇంగ్లీష్ భాష‌ల్లో అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌తారు. మెద‌క్ క‌లెక్ట‌ర్ ఆమె ఉత్త‌మ ప‌నితీరును గ‌మ‌నించిన కేసీఆర్ చివ‌ర‌కు ఆమెను త‌న కార్యాల‌యంలో అద‌నపు కార్య‌ద‌ర్శిగా నియ‌మించుకున్నారు.

ఇక స్మిత భ‌ర్త అకున్ స‌బర్వాల్ పేరు ప్ర‌స్తుతం మార్మోగుతోంది. ఆయ‌న కూడా 2001 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్‌. పోస్టింగ్ ఎక్క‌డైనా, ఆయ‌న‌కు ఏ బాధ్య‌త అప్ప‌గించినా అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌న్న విష‌యం త‌న దృష్టికి వ‌స్తే వాళ్ల భ‌ర‌తం ప‌ట్టే వ‌ర‌కు నిద్ర‌పోని నైజం ఆయ‌న‌ది. అకున్ ముందుగా డెంటిస్టు. అస్సాం కేడ‌ర్‌కు ఎంపికైన ఆయ‌న ముందుగా తీవ్ర‌వాదుల‌కు వ్య‌తిరేకంగా ఫైట్ చేశారు. ఆయ‌న అక్క‌డ ఓ జిల్లాకు ఎస్పీగా ఉన్న‌ప్పుడు తీవ్ర‌వాదుల‌కు పోలీసుల‌కు మ‌ధ్య 28 సార్లు కాల్పులు జ‌రిగాయి.

గుడుంబాను నిర్మూలించాల‌న్న ధ్యేయంగా కేసీఆర్ ఆయ‌న‌కు ఎక్సైజ్ శాఖ అప్ప‌గించారు. కేసీఆర్ న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేయ‌ని ఆయ‌న తెలంగాను గుడుంబా ర‌హిత తెలంగాణ‌గా మార్చ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ డ్ర‌గ్ మాఫియా గుట్టు ర‌ట్టు చేయ‌డంతో ఆయ‌న ఇప్పుడు స్టేట్‌లోనే డైన‌మిక్ ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా మార్మోగుతున్నారు.

ఇలా ఈ ఇద్ద‌రు భార్య‌, భ‌ర్తల పేర్లు ఇప్పుడు తెలంగాణ‌లో మార్మోగుతున్నాయి. వీరు త‌మ స‌మ‌ర్థ‌వంత‌మైన విధుల‌తో అక్క‌డ ఓ ట్రెండ్ సెట్ చేస్తూ మంచి ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నారు. ఇక ఈ దంప‌తుల‌ది ప్రేమ వివాహం కూడా కాదు… పెద్ద‌లు కుదిర్చిన పెళ్లే. ఈ గ్రేట్ ఐఏఎస్‌, ఐపీఎస్ దంప‌తుల‌కు ఒక పాప‌, బాబు ఉన్నారు.