సీన్ రివ‌ర్స్ అయ్యేస‌రికి ఏం చేయాలో తెలియ‌క పీకే

2019లో ఎలాగైనా స‌రే ఏపీలో సీఎం సీటును కైవ‌సం చేసుకుని తీరాల‌ని గ‌ట్టి ప‌ట్టుమీదున్న వైసీపీ అధినేత జ‌గ‌న్ అందుకు త‌గ్గ‌ట్టుగానే అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. బిహార్‌కు చెందిన ఐఐటీయెన్, గ‌తంలో 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌శాంత్ కిశోర్‌ను ఖ‌రీదు ఎక్కువైనా భ‌రాయించి మ‌రీ జ‌గ‌న్ త‌న స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నాడు. వాస్త‌వానికి రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు రెండేళ్ల‌కు పైగానే స‌మ‌యం ఉండ‌గా… పీకే మాత్రం రంగంలోకి దిగిపోయాడు. జ‌గ‌న్‌కి ప‌లు సూచ‌న‌లు స‌ల‌హాలు ఇచ్చాడు. అధికార ప‌క్షం టీడీపీని ఎలా ఎదుర్కోవాలో ఇప్ప‌టి నుంచే ప‌క్కాగా ముందుకు సాగుతున్నాడు.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన వైసీపీ ప్లీన‌రీలో జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాలు పేరుతో ఎన్నిక‌లు అక్క‌డెక్క‌డో ఉండ‌గానే ప్ర‌జ‌ల‌కు మినీ మేనిఫెస్టోను రుచి చూపించేశాడు. అలాగే పాద‌యాత్ర‌కూ రెడీ అయిపోయాడు. ఇదంతా ఒక ఎత్త‌యితే.. మ‌రోప‌క్క‌, పీకే.. అసలు రాష్ట్ర ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీ ప‌రిస్థితి ఏంటి? ఇప్ప‌టి కిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే ప‌రిస్థితి ఏమిటి? ముఖ్యంగా జ‌గ‌న్ గురించి ప్ర‌జ‌ల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? అనే కీల‌క విష‌యాల‌పై పొలిటిక‌ల్ స్టూడెంట్స్‌తో భారీ ఎత్తున స‌ర్వే చేయిస్తున్నాడు. ఇప్ప‌టికే విజ‌య‌న‌గ‌రం, విశాఖ త‌దిత‌ర జిల్లాల్లో ఈ స‌ర్వే కూడా ముగిసింద‌ని అంటున్నారు.

ఇక‌, ఈ స‌ర్వేలో క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు స్వీక‌రిస్తుండ‌డంతో జ‌గ‌న్ ప‌రిస్థితి ఏమిటి? అటు అధికార‌ప‌క్షం టీడీపీ హ‌వా ఎలా ఉంది? చ‌ంద్ర‌బాబు గురించి ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? అనే విష‌యాల‌పై ప‌లు వాస్త‌వాలు వెల్ల‌డ‌వుతున్నాయి. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు త‌మ‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ.. చంద్ర‌బాబు పాల‌న‌కు మంచి మార్కులు వేస్తున్నారు. అయితే, తెలుగు త‌మ్ముళ్ల వ్య‌వ‌హార శైలిపై మాత్రం నిప్పులు చెరుగుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆగ‌డాల‌కు హ‌ద్దు అదుపు లేకుండా పోతోంద‌ని, దందాలు, అవినీతి పెరిగిపోయింద‌ని చెప్పుకొచ్చారు. బాబు క‌ష్ట‌ప‌డుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో నేతల ప‌నితీరుతో టీడీపీకి ఆద‌ర‌ణ త‌గ్గుతోంద‌ని అంటున్నారు.

ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి జ‌గ‌న్ తీరు మారాల‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. కేడ‌ర్‌కు స‌మ‌యం కేటాయించాల‌ని, లోట‌స్ పాండ్‌లో అందుబాటులో ఉండాల‌ని, చిన్న‌పాటి నేత‌ల అభిప్రాయాలు కూడా విలువ ఇవ్వాల‌ని జ‌నాలు నిస్సంకోచంగా చెప్పారు. అదేస‌మ‌యంలో టీడీపీపై వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలో వైసీపీ విఫ‌ల‌మైంద‌నే ప‌చ్చి నిజాన్నీ వెల్ల‌డించారు. అంతే!! ఇంకే ముంది పీకేకి షాక్ త‌గిలింది. వాస్త‌వానికి తాను ఊహించింది.. బాబుపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంద‌ని, జ‌గ‌న్‌ను జ‌నం అమితంగా ఆద‌రిస్తార‌ని అయితే, సీన్ రివ‌ర్స్ అయ్యేస‌రికి ఏం చేయాలో తెలియ‌క ఇప్పుడు మ‌ళ్లీ కొత్త ప్లాన్‌ల‌పై దృష్టి పెట్టాడ‌ట‌. మ‌రి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.