డ్రగ్స్ విచారణ మీకెందుకు…మంత్రులపై కేసీఆర్ ఫైర్

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ విచార‌ణ టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ విచార‌ణ‌లో ఎంతో మంది ప్ర‌ముఖులు ఉన్నా కేసీఆర్ మాత్రం ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. విచారణలో ఎవ‌రి జోక్యం లేకుండా చూస్తున్నారు. టాలీవుడ్‌కు చెందిన 12 మందికి నోటీసులు జారీ చేసిన సిట్ రోజుకు ఒక్క‌రి చొప్పున విచారిస్తోంది.

ఇప్ప‌టికే 9 మందిని విచారించిన సిట్ మ‌రో ముగ్గురిని విచారించ‌నుంది. ఇక వీరు చెప్పిన ఆధారాల‌ను బేస్ చేసుకుని మ‌రి కొంత‌మందికి కూడా సిట్ నోటీసులు జారీ చేసి, వారిని కూడా విచారించ‌నుంది. ఓవ‌రాల్‌గా తీగలాగితే డొంక క‌దిలిన చందంగా డ్ర‌గ్స్ ఇష్యూలో చాలా మంది పేర్లు ఇంకా బ‌య‌ట‌కు వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా కేసును అకున్ స‌మ‌ర్థ‌వంతంగా డీల్ చేస్తుండ‌డంతో ఆయ‌న‌పై ఎన్నో ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖలతో పాటుగా బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు, ఐఏఎస్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా విన్పించినట్లు తేలడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమయ్యారు. అకున్ స‌బ‌ర్వాల్‌కు ఇప్ప‌టికే బెదిరింపులు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ క్ర‌మంలోనే ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, హోంమంత్రి నాయని నరసింహారెడ్డిలపై కూడా బడా బాబుల నుంచి ఒత్తిళ్లు రావ‌డంతో వారు ఈ విష‌యాన్ని స‌న్నిహితుల‌కు చెప్పార‌ట‌.

ఈ విష‌యాన్ని ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి తెలుసుకున్న కేసీఆర్ డ్ర‌గ్స్ కేసు విచార‌ణ విష‌యంలో ఎలాంటి ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌వ‌ద్ద‌ని, అస్స‌లు ఏం మాట్లాడ‌వ‌ద్ద‌ని వీరిద్ద‌రికి వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇక హోం మంత్రి నాయిని ఇటీవ‌ల ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కూడా కేసీఆర్ ఆయ‌న‌పై సీరియ‌స్ అవ్వ‌గా,

తనను మీడియా అడిగినందువల్లే స్పందించానని నాయని వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే విచారణలో జరిగే ఏ అంశాన్ని మంత్రులకు తెలియపర్చాల్సిన అవసరం లేదని కూడా కేసీఆర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.