అవును ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందురూ ఇదే మాట్లాడుతున్నారు. ఉద్యమ పార్టీ టీఆర్ ఎస్‌ని రాజకీయ పార్టీగా మార్చి, తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్ వెనువెంటనే తన పుత్ర రత్నాన్ని కూడా మంత్రిగా కూర్చోబెట్టారు. బంగారు తెలంగాణ తమతోనే సాధ్యమవుతుందని గట్టిగా చెప్పొకచ్చారు. దీంతో జనాలు నిజమే అనుకున్నారు. టీఆర్ ఎస్ జెండాలు కట్టారు. జేజేలు కొట్టారు. ఇంతలోనే.. డామిట్! కథ అడ్డం తిరిగింది. తండ్రీ కొడుకులకు వాస్తు భయం పట్టుకుంది. అతిరథ మహారథులు సైతం సోనియా ముందు ఒణికి పోయినా.. ఏమాత్రం జంకుగొంకు లేకుండా ఆమెను ఎదిరించిన కేసీఆర్.. కనిపించని వాస్తు పురుషుడికి ఒణికిపోతున్నారట!
ఆయనతోపాటు ఆయన కుమారుడు కేటీఆర్ కూడా నిలువెల్లా ఒణికిపోతూ.. తండ్రి చూపిన బాటలో ఇంటిపట్టునే ఉంటున్నారట. దీంతో ప్రజలు ఇప్పుడు ఈసురో మంటూ తమ కష్టాలు చెప్పుకునే నాథుడెవడ్రా అంటూ అలమటిస్టున్నారట. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అతి పెద్ద సచివాలయ్యాన్ని తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించారు. అంటే ఏపీ సొంతంగా నిర్మించుకుంటుంది. దీంతో ఆ సచివాలయం తెలంగాణ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. అది ఉమ్మడి ఏపీపాలకుల పాలనలో కట్టింది కావడంతో కేసీఆర్‌కి నచ్చలేదు. దీంతో ఆయన వాస్తు బాగాలేదంటూ.. విషయాన్ని వాస్తు వైప్పు తిప్పారు.
ఎంత మంది కాదన్నా.. ఔనన్నా.. దాన్ని కూల్చేసి.. కొత్తది కట్టడం ఖాయంగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఆయన పూర్తిగా సచివాలయం ముఖం చూడడం మానేశారు. అయితే, ప్రగతి భవన్ పేరుతో సరికొత్త హంగులతో నూతన భవనాన్ని కట్టుకున్నారు. ఇక్కడే ప్రజాదర్బార్ నిర్వహిస్తానని ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకు లేదు. దీంతో ప్రజలకు కేసీఆర్ దర్శనం దాదాపు కనుమరుగైంది.
ఇక, కేటీఆర్ విషయానికి వస్తే.. సందర్శకులు పెద్ద ఎత్తున వస్తున్నారని తన కార్యాలయాన్ని సచివాలయం నుంచి క్యాంప్ ఆఫీసుకు కార్యాలయాన్ని మార్చారు. అంటే ఇప్పుడు సీఎం కెసీఆర్ తో పాటు మంత్రి కెటీఆర్ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారన్న మాట. ఈ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రజల ఓట్లతో గెలిచి చివరకు ప్రజలకే అందుబాటులో లేకపోవటం సరికాదని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరి ఈ ఉద్యమ నేతలు ఏం చెబుతారో చూడాలి.