సంచలన నిర్ణయాలకు పెట్టి పేరైన దివంగత వైఎస్ కుమారుడు, వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికలకు సంబంధించి.. మరింత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయంలో ఉండగానే ఆయన ప్రజలపై నవ రత్నాల పేరుతో వరాల జల్లు కురిపిస్తూ.. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
అదేసమయంలో ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. వైసీపీ తరఫున 2019లో పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులపై జగన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించేశారు. ఈ క్రమంలో ఆయన తన సొంత బాబాయి.. వైఎస్ మరణించినప్పటి నుంచి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీని, జగన్ని వెంట పెట్టుకుని ఉన్న సుబ్బారెడ్డికి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఒంగోలు నుంచి లోక్ సభకు సుబ్బారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఒకరకంగా ఈ స్థానం వైసీపీకి కంచుకోట. ప్రస్తుతం ఎంపీ స్థానంలో ఉన్న సుబ్బారెడ్డి కూడా తన అనుచరులను అక్కడ నియమించి, తాను ఎక్కడున్నా సరే నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటున్నారనే పేరు సంపాయించారు. అందుకే చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈ నియోజకవర్గంపై శీతకన్నేసింది!
అలా పేరు సంపాయించిన సుబ్బారెడ్డికి 2019లో ఎంపీ టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో ఇప్పుడు ఈ వార్త పెను సంచలనమైంది. అదేసమయంలో నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్కు పూర్తిస్థాయి భజన పరుడుగా ఉన్న తిక్కవరకు సుబ్బరామి రెడ్డికి పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఈ నిర్ణయమూ సంచలనంగా నే మారింది.
ఇక, 2019 ఎన్నికలకు సంబందించి జగన్ ఇప్పటికి నాలుగు ఎంపీ స్థానాలపై ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. అంటే, నలుగురికి ఎంపీ టికెట్లు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వీరంతా తనను కష్టకాలంలో ఆదుకున్నవారేనని జగన్ అభిప్రాయంగా చెబుతున్నారు. వారెవరంటే.. విశాఖకు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, విజయవాడకు పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్, గుంటూరుకు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఒంగోలు నుంచి ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త ఉన్నట్టు తెలిసింది.
ఇక సుబ్బారెడ్డిని పూర్తిస్థాయిలో ప్రజా రాజకీయాల నుంచి తప్పించి కేవలం పార్టీ రాజకీయాలకే పరిమితం చేయాలని జగన్ భావిస్తున్నట్టు తెలిసింది. ఇదే నిజమైతే.. జగన్ కొత్త ప్రయోగాలకు రెడీ అవుతున్నట్టే భావించాలి.