రాజ‌కీయ చాణుక్యుడికి వైసీపీ ఎంపీ టిక్కెట్‌ ఖ‌రారైన‌ట్టే

ఏపీలో రాజ‌కీయ పోరు నిన్న‌టి వ‌ర‌కు టీడీపీ, వైసీపీ మ‌ధ్యే ఉన్నా పవ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన ఎంట్రీతో ముక్కోణంగా మారింది. అయితే జ‌న‌సేన ప్ర‌భావం రాష్ట్రం మొత్తం ఉంటుందా ? లేదా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మ‌వుతుందా ? అని ప్ర‌శ్నించుకుంటే ప్ర‌స్తుతానికి జ‌న‌సేన ప్ర‌భావం కొన్ని చోట్ల మాత్ర‌మే ఉండే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇక ఈ వేడి ఎలా ఉంటే గ‌తంలో కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి, ఆ పార్టీలోనే ఉన్న వారు, ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు, బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌యిన వారు ఇంకా రాజ‌కీయంగా ఉద్యోగాన్ని చూసుకోలేదు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల టైం కూడా లేని వేళ ఇప్పుడు వారంతా తిరిగి యాక్టివ్ అయ్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాంధ్ర‌లోని అన‌కాప‌ల్లి మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి టీడీపీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్న వార్త‌లు వ‌స్తుండ‌గానే ఇప్పుడు మ‌రో మాజీ ఎంపీ సైతం పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. అయితే ఆయ‌న ఓ రాజ‌కీయ నాయ‌కుడే కాదు అప‌ర రాజ‌కీయ మేథావి కూడా. ఆయ‌న ఎవ‌రో కాదు రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌.

టీడీపీ అన్నా చంద్ర‌బాబు అన్నా పాయింట్లు లాగి మ‌రీ విమ‌ర్శ‌లు చేసే ఉండ‌వ‌ల్లి ఛాన్స్ దొరికితే చాలు చంద్ర‌బాబుని ఏకిప‌డేస్తున్నారు. అసెంబ్లీలో వర్షపు నీరు లీకేజి వ్యవహారంపై ఉండవల్లి మాట్లాడారు. మీడియాని లోనికి అనుమతించకపోవడం దారుణమని ఆయ‌న అన్నారు.

గ‌తంలో వైఎస్ శ‌త్రువుల‌ను ఓ రేంజ్‌లో టార్గెట్ చేసి వైఎస్‌కు అత్యంత స‌న్నిహితుడిగా మారిన ఉండ‌వ‌ల్లి ఈనాడు అధినేత రామోజీరావును సైతం ఎలా టార్గెట్ చేశారో తెలిసిందే. ఇక రాజ‌కీయ మేథావిగా పేరున్న ఉండ‌వ‌ల్లి వైసీపీలో చేర‌డం ఖ‌రారైన‌ట్టే తెలుస్తోంది. టైం, ముహూర్తం ఎప్పుడ‌న్న‌ది ఫిక్స్ కాక‌పోయినా ఆయ‌న జ‌గ‌న్ చెంత‌కు చేర‌డం ఖాయమైన‌ట్టే. ఉండ‌వ‌ల్లికి జ‌గ‌న్ రాజ‌మండ్రి వైసీపీ ఎంపీ సీటు ఇచ్చేసిన‌ట్టే అంటున్నారు.