టీటీడీపీలో ఆయ‌న డ‌మ్మీల‌కే డ‌మ్మీనా..!

తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి ఎంత దిగ‌జారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో 15 ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటును గెలుచుకున్న టీడీపీకి ఇప్పుడు అక్క‌డ కేవ‌లం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్నారు. వీరిలో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్నా లేన‌ట్టే లెక్క‌. ఇక టీటీడీపీకి ఓన్లీ అండ్ వ‌న్ మ్యాన్ ఎవ‌రంటే రేవంత్‌రెడ్డి ఒక్క‌డే. తెలంగాణ‌లో రేవంత్ పార్టీ వాయిస్ వినిపిస్తున్నా పార్టీ ప‌రంగా క‌న్నా త‌న బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకే ఎక్కువుగా తాప‌త్ర‌య‌ప‌డుతున్నార‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల వేళ రేవంత్ టీడీపీలో ఉంటారా ? లేదా ? మ‌రేదైనా పార్టీలోకి వెళ‌తారా ? అన్న సందేహాలు సైతం ఉన్నాయి. ఏదేమైనా తెలంగాణ‌లో ప్ర‌స్తుతం టీడీపీకి ఉన్న ఏకైక ఆశాకిర‌ణం రేవంత్‌రెడ్డి ఒక్క‌రే అన్న‌ది మాత్రం స‌త్యం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అటు పార్టీని పూర్తి స్థాయిలో క‌బ్జా చేయ‌గా, ఇటు అసెంబ్లీలోను పార్టీ త‌ర‌పున తాను ఒక్క‌డే వాయిస్ వినిపిస్తున్నారు. రేవంత్ దూకుడు దెబ్బ‌తో మిగిలిన నాయ‌కులు క‌నుమ‌రుగైపోతున్నారు.

రేవంత్ త‌మ‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేద‌ని వాపోతున్న సీనియ‌ర్లు చంద్ర‌బాబుకు చెప్పినా ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో వారు కిమ్మ‌న‌కుండా ఉంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ సైతం ఇప్పుడు రేవంత్ తీరుపై లోలోన తీవ్ర‌స్థాయిలో ర‌గిలిపోతున్నార‌ని తెలుస్తోంది.

తెలంగాణలో 2019 ఎన్నికల్లో తాను చెప్పిన వాళ్లకే టీడీపీ టికెట్లు వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పడంతో… కొందరు నాయకులు ఎల్.రమణను ఆశ్రయిస్తున్నారు. రేవంత్‌తో అంటీముట్ట‌న‌ట్టుగా ఉండే ఆయ‌న వ్య‌తిరేక‌వ‌ర్గం అంతా ఇప్పుడు టిక్కెట్ల కోసం ర‌మ‌ణ‌ను న‌మ్ముకుంటోంది. టిక్కెట్ల కోసం త‌న వ‌ద్ద‌కు వ‌స్తోన్న వారిని ర‌మ‌ణ ఎలాంటి హామీలు ఇవ్వ‌లేక‌పోతున్నార‌ట‌. ఆయ‌న పూర్తిగా టీటీడీపీలో డ‌మ్మీగా మారిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది.

ఆలూ లేదు చూలూ లేదు…కొడుకు పేరు సోమ‌లింగం అన్న చందంగా టీడీపీ త‌ర‌పున పోటీ చేస్తే గెలవ‌డం సంగ‌తి…డిపాజిట్లు వ‌స్తాయా ? లేదా ? అన్న సందేహాలు త‌లెత్తుతోన్న టైంలో టీటీడీపీలో అప్పుడే టిక్కెట్ల కోసం ఫైటింగ్ మొద‌ల‌వ్వ‌డం హాశ్చ‌ర్య‌మే..!