పార్టీకి గుడ్ బై యోచ‌న‌లో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే..?

గుంటూరులో టీడీపీకి త్వ‌ర‌లోనే షాక్ త‌గ‌ల‌బోతోందా? కొంత కాలం నుంచీ ప్ర‌భుత్వ ప‌నితీరు, అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే.. పార్టీకి `ఇక సెల‌వు` అంటూ త‌న దారి తాను చూసుకోవాలని నిర్ణ‌యించుకున్నారా? అంటే అవుననే స‌మాధాన‌మే వినిపిస్తోంది. గుంటూరు-2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్య‌వ‌హార శైలి పార్టీ నేత‌ల‌కు అంతుచిక్కడం లేదు. మంత్రులే టార్గెట్గా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

స్వ‌ప‌క్షంలో ఉంటూనే విప‌క్షంలా ఉండ‌టం మింగుడు ప‌డ‌ని అంశం! త‌న‌పై అధిష్టానం గుర్రుగా ఉంద‌ని గ్ర‌హించిన ఆయ‌న‌.. ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఇక‌రేపో మాపో రాజీనామా చేసి వైసీపీలో చేర‌తానే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది,.

ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మ‌మైనా, ప్రైవేటు కార్య‌క్ర‌మ‌మైనా మోదుగుల‌ టార్గెట్ ఒక్క‌టే! ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌డం. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా.. ప్రతిప‌క్ష ఎమ్మెల్యేగా వ్య‌వ‌హరిస్తున్నారు! ప్రభుత్వంపై పదే పదే విమర్శలు గుప్పిస్తూ ప్రతిపక్షాలకు ఆయన అస్త్రాలు అందిస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి పుల్లారావును లక్ష్యంగా చేసుకుని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. నకిలీ విత్తనాల తయారీదారుల్లో పుల్లారావు అనుచరులు ఉన్నారని, వాళ్లను ఆయ‌న కాపాడుతున్నారని విమ‌ర్శించారు. ఆయ‌న విమ‌ర్శ‌ల వెనుక గూడుక‌ట్టుకున్న అసంతృప్తే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

గత ఎన్నికల సమయంలో ఆయ‌న సిట్టింగ్ ఎంపీ. అయినా ఆయ‌నకు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని కానీ దానిని నిలబెట్టుకోలేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఇంకా తనను అవమానిస్తున్నారని వాపోతున్నారు. సొంత నియోజకవర్గంలో ఉన్న మార్కెట్‌యార్డు చైర్మన్‌ పదవి విషయంలో మంత్రి పుల్లారావు కలుగ చేసుకుని తన అనుచరునికి ఇప్పించుకున్నారని, అధిష్టానం ఈ విష‌యంలో ప‌ట్టించుకోలేద‌ని.. ఇదంతా తనను అవమానాలు పాలు చేయడానికేనని ఆయన అంటున్నారు.

అవమానాలు భరించి ఇక పార్టీలో కొనసాగడానికి తాను సిద్ధంగా లేనని సన్నిహితుల వ‌ద్ద మోదుగుల‌ వాపోతున్నార‌ట‌. అయితే మూడేళ్లుగా ఎమ్మెల్యేగా ఆయ‌న‌ పనితీరు నాసిరకంగా ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఆయనను పక్కకు పెట్టాలనే నిర్ణయానికి వచ్చిందట. ఇది తెలిసిన ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలో ఆయన వైకాపాలోకి జంప్‌ కావడం ఖాయమని వారు అంటున్నారు. సొంత బావ అయోధ్యరామిరెడ్డి వైకాపాలో ఉండడంతో మోదుగుల‌ కూడా అదే దారిలో నడుస్తారని వారు చెబుతున్నారు.