ఆ మంత్రి ఆర‌గింపు సేవ‌.. ఖ‌ర్చు.. అక్ష‌రాలా నాలుగు ల‌క్ష‌లు!

త‌న‌ది కాక‌పోతే.. కాశీదాకా ఎదురు డేక‌చ్చ‌ని సామెత‌! ఇప్పుడు క‌ర్ణాట‌క మంత్రి వ‌ర్యుడు ఒకాయ‌న వ్య‌వ‌హారం కూడా అచ్చు ఇలానే ఉందట‌. ఆయ‌న గారి ప‌దిరోజుల భోజ‌నం ఖ‌ర్చు 4 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ట‌! సాధార‌ణంగా ఎంత పెద్ద హోటల్‌లో భోజ‌నం చేసినా పూట‌కి 4 వేల‌కు మించి బిల్లు కాదు. ఇక‌, సాధార‌ణ బోజ‌నం అయితే, రూ.200 బిల్లు దాట‌నే దాటుదు. అయిన‌ప్ప‌టికీ.. క‌ర్ణాట‌క‌లోని ఓ మంత్రి మాత్రం వ‌స్తోంది క‌దా ఊరికినే అని ప‌ది రోజుల్లో రూ.4 ల‌క్షల ఖ‌ర్చ‌య్యేలా భోజ‌నం చేసేశాడ‌ట‌.

విష‌యంలోకి వెళ్తే.. 2016లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలను కర్ణాటక ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 21 నుంచి డిసెంబర్ 3 వరకూ బెళగావిలో జరపింది. మొత్తం పదిరోజుల పాటు ఈ శీతాకాల సమావేశాలు జరిగాయి. ఈ ప‌దిరోజులు ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల సొమ్ముతో రాజ‌భోగం అనుభ‌వించార‌ట‌. ఇందులో కర్ణాటక న్యాయశాఖ మంత్రి జయచంద్ర పదిరోజుల భోజనం ఖర్చు నాలుగు లక్షల ఏడు వేలరూపాయలు అని తేలింది. పదిరోజుల పాటు నాలుగు లక్షల భోజనం ఏం చేశారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఒక పూట భోజనానికి 3,352 రూపాయలు ఖర్చు చేశారు. అతి తక్కువ ఖర్చు చేసిన వ్యక్తి బీజేపీ శాసనసభ పక్ష నేత జగదీశ్ శెట్టర్. ఈయన ఒక పూట భోజనం ఖర్చు యాభై రూపాయలు మాత్రమే. దీంతో ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో జ‌య‌చంద్ర భోజ‌నంపైనే ప్ర‌తి ఒక్క‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ఇంత‌కీ ఇన్నాళ్ల త‌ర్వాత ఈ విష‌యం బ‌య‌ట‌కెలా వ‌చ్చింద‌ని అంటారా? ఓ వ్య‌క్తి.. ఆర్‌టీఐ ద్వారా ప్ర‌భుత్వం చేసిన ఖ‌ర్చుకు జ‌మా ఖ‌ర్చులు కోర‌డంతో మంత్రిగారి బాగోతం ఇలా బ‌య‌ట‌ప‌డింద‌ట‌!!