ఏపీ, తెలంగాణాలో ఇద్దరి చంద్రుల పరిస్థితి ఇదే!

ఏపీ, తెలంగాణ సీఎంల తీరు అత్త సొమ్ముకు అల్లుడి ప్ర‌చారం అన్న‌ట్టుగా ఉంది. ఏపీని దేశంలోనే ఫ‌స్ట్ స్టేట్ చేస్తాన‌ని ఇక్క‌డి సీఎం చంద్ర‌బాబు.. తెలంగాణ‌ను బంగారు తెలంగాణ చేస్తాన‌ని కేసీఆర్ ఇద్ద‌రూ ఒక‌రిని మించి ఒక‌రు ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ప్ర‌భుత్వం సొమ్మును త‌మ ఇష్టానుసారం ఖ‌ర్చు చేసేస్తున్నారు. పైగా ఆ ఖ‌ర్చును వాళ్ల సొంత జేబుల్లోంచి చేసిన ఖ‌ర్చుగా వాళ్ల పేర్లు పెట్టుకుంటున్నారు.

ఏపీలో చంద్ర‌బాబు గ‌త పాల‌న‌కు ఇప్ప‌టికీ ఎంతో తేడా క‌నిపిస్తోంది. గ‌తంలో ఏదైనా ప‌థ‌కం ప్రారంభిస్తే.. దానికి జ‌న్మ‌భూమి, మావూరు ఇలా సోష‌ల్ ట‌చ్ ఉండే పేర్లు పెట్టేవారు. అయితే, ఇప్పుడు బాబు ట్రెండ్ మారింది. ప్ర‌తి దానికీ.. త‌న పేరును త‌గిస్తున్నాడు. వాస్త‌వానికి ఈ సంస్కృతి త‌మిళ‌నాడులో ఎక్కువ‌. ఏ ప‌థ‌కానికైనా అమ్మ‌పేరును త‌గిలంచ‌డం జ‌య‌తోనే మొద‌లైంది. దీనివ‌ల్ల చిన్న ప‌థ‌కంతో పెద్ద పేరు వ‌చ్చేలా ఆమె ప్లాన్ చేసుకుంది. ఇప్పుడు దీనిని ఏపీ సీఎం చంద్ర‌బాబు అందుకున్నారు.

సంక్రాంతి, రంజాన్, క్రిస్మ‌స్ త‌దిత‌ర పండ‌గ‌ల‌కు ఇచ్చే కానుక‌ల‌కు చంద్ర‌న్న కానుక అని పేరు పెట్టారు. వాస్త‌వానికి కానుక అంటే.. సొంత డ‌బ్బుతో పంచేవి. అయితే, ఇక్క‌డ ప్ర‌తి దీ ప్ర‌జా సొమ్ముతో కొనుగోలు చేసిన‌వే. కానీ బాబు త‌న పేరును ప్ర‌తిదానికీ త‌గిలిస్తున్నాడు. ఇక‌, మొన్న‌టి వ‌ర‌కు మిష‌న్ భ‌గీర‌థ‌, కాక‌తీయ వంటి పేర్లు పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు త‌న రాష్ట్రంలోనూ తాను ప్రారంభించే ప‌థ‌కాల‌కు త‌న పేరు పెట్టేసుకుంటున్నారు.

తాజాగా.. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో బాలింత‌ల‌కు కిట్‌లు ఇవ్వ‌డం ప్రారంభించారు. దీనికి కేసీఆర్ కిట్‌గా పేరు పెట్టుకున్నారు. వాస్త‌వానికి ఈ కిట్‌కు రూ. 2000 దాకా ఖ‌ర్చ‌వుతుంది. ఈ సొమ్ము పూర్తిగా ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి వ‌స్తుంది. కానీ, కేసీఆర్ మాత్రం త‌న సొంత పేరు పెట్టుకుండ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇలా ఇక రాబోయే రెండేళ్ల‌లో ఈ ఇద్ద‌రు సీఎంలు ఇంకెన్నిప‌థ‌కాల‌కు వాళ్ల పేర్లు పెట్టుకుంటారో చూడాలి. కానీ, ఒక్క‌మాట నిజం.. జ‌నాలు పిచ్చి వాళ్లు మాత్రం కాదు.

అటు ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో మాయావ‌తి హ‌యాలో ప్ర‌తి సెంట‌ర్‌లోనూ ఆమె త‌న ఎన్నిక‌ల గుర్తు ఏనుగు బొమ్మ‌లు ఏర్పాటు చేసి.. త‌న పేరు, త‌న ఎన్నిక‌ల గుర్తును ప్ర‌జ‌ల్లో చిర‌స్థాయిగా ఉండిపోయి.. స్థిరంగా యూపీలో త‌న పాల‌నే సాగాల‌ని ఆకాంక్షించింది. అయితే.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. ఇక‌, ఏపీలోను, తెలంగాణ‌లోనూ ప‌రిస్థితి అంతే.. ప్ర‌జ‌లు ఎక్క‌డైనా ప్ర‌జ‌లే! ఈ విష‌యాన్ని తెలుసుకుంటే.. మంచిద‌ని విశ్లేషకులు అంటున్నారు.