రాహుల్ స‌భ‌లో ఆ సీనియ‌ర్ ఎక్క‌డ‌..!

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతాయో చెప్ప‌డం క‌ష్టం. ఉమ్మ‌డి రాష్ట్రంలో అందునా అటు వైఎస్ ప్ర‌భుత్వం, ఇటు కిర‌ణ్ కుమార్ ప్ర‌భుత్వంలో ఓ వెలుగు వెలిగి.. ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ 2గా పేరు ప‌డ్డ కాంగ్రెస్ సీనియ‌ర్ ద‌ళిత నేత దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌. ఇప్పుడు ఈయ‌నను కాంగ్రెస్ ఎందుకో దూరం పెడుతోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. మ‌రో రెండేళ్ల‌లో తెలంగాణ‌లో అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌లు పొంచి ఉన్న స‌మ‌యంలో ద‌ళిత వ‌ర్గానికి చెందిన మాస్ లీడ‌ర్‌ను ఇలా దూరం పెట్ట‌డంపై అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకు ఇలా జ‌రిగింది? అని చ‌ర్చించుకుంటున్నారు.

సంగారెడ్డిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పాల్గొన్న ప్రజా గర్జన సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే, నిన్నటి సభలో దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌కు మాట్లాడే అవ‌కాశం ల‌భించ‌లేదు. కాంగ్రెస్ ప్రజా గర్జన జరిగింది స్వయానా దామోదర రాజనర్సింహ సొంత జిల్లాలోనే. అయితే ఈ సభలో రాహుల్ రావడానికి ముందు.. రాహుల్ వచ్చాక చాలా మంది నేతలు మట్లాడారు. మెదక్ జిల్లా నేతలతో పాటు ఆ జిల్లాకు చెందని వారు కూడా ప్రసంగాలు దంచేశారు. కానీ దామోదరునికి మాత్రం మైకు పట్టుకునే అవకాశం రాలేదు. పార్టీ నేతలే ఆయన చేత మాట్లాడించలేదా..? ఆయనే ప్రసంగానికి దూరంగా ఉన్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి సంగారెడ్డి సభ ఏర్పాట్లలో దామోదర రాజనర్సింహ చాలా చురుగ్గా పాల్గొన్నారు. సొంత జిల్లాలో జరుగుతున్న సభ కావడంతో చాలా ఉత్సాహం కనబరిచారు. కానీ క్లైమాక్స్ కు వచ్చే సరికి సీన్ రివర్స్ అయ్యింది. ఆయన ఎవరికీ కాకుండా పోయారు. ఓ సాధారణ నేతలా స్టేజి పైన కూర్చుండి పోయారు. రాహుల్ కు జరిగిన సన్మాన కార్యక్రమాల్లో కానీ …స్టేజిపై మాట్లాడే విషయంలో కానీ మాజీ డిప్యూటీకి అస్సలు అవకాశం దక్కలేదు. అయితే రాహుల్ సభలో దామోదరను పక్కన పెట్డానికి అంతర్గత కుమ్ములాటలే కారణమని స‌మాచారం. మ‌రి ఇలాంటి వాటికి రాహుల్ చెక్ పెట్టి .. అంద‌రినీ క‌లుపుకొని పోయేలా చేయాల్సిందిపోయి మౌనంగా ఉండిపోవ‌డం మ‌రో చ‌ర్చ‌కు దారితీసింది.