`కంటెంట్` లేని ట్వీట్ల‌తో ప‌వ‌న్‌కే న‌ష్ట‌మా?

రాజ‌కీయ నాయ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ట్వీట్లు లేదా బ‌హిరంగ లేఖల ద్వారా త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నారు జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్‌! ప్ర‌స్తుతం ఆయ‌న‌ రాసిన ఒక లేఖ‌, చేసిన‌ ఒక ట్వీట్ పై తీవ్రమైన చ‌ర్చ జ‌రుగుతోంది. అంతేగాక జ‌న‌సేన రీసెర్చి డిపార్ట్‌మెంట్‌పై సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తున్నాయి! ఏదైనా అంశంపై మాట్లాడాలంటే అధ్య‌య‌నం త‌ప్ప‌నిస‌రి. అన్ని విష‌యాల్లోనూ కంటెంట్ తో మాట్లాడే ప‌వ‌న్‌.. రెండు విష‌యాల్లో మాత్రం కంటెంట్ లేకుండా మొక్కుబ‌డిగా వ్య‌వ‌హ‌రించార‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం! లేనిప‌క్షంలో సినీ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ ట్వీట్ల లానే వీటినీ ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని హెచ్చ‌రిస్తున్నారు.

జ‌న‌సేన‌కు క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్నీ ప‌వ‌న్ క‌ల్యాణే!! ట్విట్ట‌ర్ ఒక్క‌టే అధికార ప్ర‌తినిధి! స‌ల‌హాలు ఇచ్చేవారూ, ప్రెస్ నోట్లు రాసేవారూ, ట్వీట్ల‌కు కంటెంట్లు ప్రొవైడ్ చేసేవారినే ఎక్కువ‌గా న‌మ్ముకున్నాడు ప‌వ‌న్‌. ట్వీట్లు, లేఖ‌ల ద్వారానే ప్ర‌జ‌ల్లోకి చేరువ కావాల‌ని చూస్తున్నారు. అయితే వీరిని మార్చాల్సిన త‌రుణం ఇదే అని ప‌వ‌న్ గుర్తించాలనేది విశ్లేష‌కు ల మాట‌. లేనిప‌క్షంలో ఇంకా అభాసుపాలైపోయే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. హోదా స‌మ‌యంలో ఉత్త‌రాది ద‌క్షిణాది అంటూ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు అప్పుడు ప్ర‌జ‌ల్లోకి వెళ్లినా ఇప్పుడు వాటిని పట్టించుకునేవారే లేరు. టీటీడీ ఈవోగా ఉత్త‌రాది వ్య‌క్తిని నియ‌మించార‌ని ప‌వ‌న్ చేసిన ట్వీట్ వివాదం రేపుతోంది.

అమ‌ర్‌నాథ్, మ‌ధుర వంటి క్షేత్రాల్లో ద‌క్షిణాది వారికి ప్రాధాన్య‌త ఎక్క‌డుందీ అని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం అర్థం లేనిద‌ని వాదిస్తున్నారు. ఎక్క‌డో నేపాల్ లో ఉన్న ప‌శుప‌తినాథ్ ఆల‌యం ద‌గ్గ‌ర నుంచి ఉత్త‌రాదిలోని కొన్ని ప్ర‌ముఖ క్షేత్రాల్లో ప్ర‌ధాన అర్చ‌కులుగా ఉంటున్న‌ది ద‌క్షిణాదివారే అన్న విష‌యాన్ని గుర్తుచేస్తున్నారు! ఐ.ఎ.ఎస్‌. అధికారులంటే దేశంలోని ఎక్క‌డైనా ప‌నిచేయచ్చు. వారిని కొన్ని చోట్ల నియ‌మించుకోవ‌డం అనేది రాష్ట్రాల విచ‌క్ష‌ణ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. సివిల్ స‌ర్వీసెస్ గురించి ప‌వ‌న్ కి ఎవ్వ‌రూ చెప్పినట్టులేద‌ని వివ‌రిస్తున్నారు. ఇక ఉరుములేని పిడుగులా.. మిర్చిరైతుల క‌ష్టాల‌పై ఏ ప్ర‌భుత్వానికి రాశారో తెలియ‌కుండా లేఖ గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది.

చంద్ర‌బాబును విమ‌ర్శ‌లేక‌.. కేసీఆర్ ను ప్ర‌శ్నించే ధైర్యం చాల‌క‌.. పొడిపొడి మాట‌ల‌తో రైతుల క‌ష్టాల‌ను అడ్రెస్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. క‌నీసం ఈ క్ర‌మంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారుపై అయినా కాస్త ఘాటుగా రెండు మాట‌లు వాడితే బాగుండేది. మిర్చి రైతుల క‌ష్టాల‌పై నేను సైతం స్పందించాను అని చెప్పుకోవ‌డానికి త‌ప్ప‌.. అంత‌కుమించిన ప్ర‌భావాన్ని స‌ద‌రు నోట్ క్రియేట్ చేయ‌లేక‌పోయింది. దీంతో `కంటెంట్` తో మాట్లాడేవాళ్లు టీమ్‌లో తీసుకోవాల‌ని కావాల‌ని లేనిప‌క్షంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్లు కూడా రానురానూ రామ్ గోపాల్ వ‌ర్మ రాత‌ల్లా జ‌నం లైట్ తీసుకునే ప్ర‌మాదం ఉందని చెబుతున్నారు.