ప‌వన్ అభిమానుల‌కు తీపి, చేదు క‌బురు

అనుకున్న‌దంతా అయింది. రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణం చేస్తాడ‌నుకున్న తమ నాయ‌కుడు పెద్ద బాంబు పేల్చాడు. అవ‌స‌ర‌మైతే సినిమాలు కూడా మానుకుంటాన‌ని తేల్చిచెప్ప‌డంతో ఆయన అభిమానులంతా నిరాశ చెందారు. జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు తీపి క‌బురుతో పాటు చేదు క‌బురు కూడా అందించాడు. ఇప్పుడు సంబ‌ర‌ప‌డాలో లేక నిరుత్సాహ‌ప‌డాలో తెలియక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. రాజ‌కీయాల‌పై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు ప‌వ‌న్‌. భ‌విష్య‌త్తు కార్యాచర‌ణ‌ను ప్ర‌క‌టించాడు. అంతేగాక త‌న‌ను పార్ట్‌టైమ్ రాజ‌కీయనాయకుడ‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న వారికి స‌మాధానం ఇచ్చాడు.

సినిమాలు ముఖ్య‌మా?? ప్ర‌జా జీవితం, వాళ్ల స‌మ‌స్య‌లు ముఖ్య‌మా?? అంటే ప్ర‌జా జీవిత‌మే ముఖ్య‌మంటున్నాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. సినిమాలంటే త‌న‌కు వ్యామోహం లేద‌ని, సినిమాల నుంచి త‌ప్పుకోవ‌డానికి కూడా తాను సిద్దంగా ఉన్నాన‌ని ఇది వ‌ర‌కే చెప్పాడు ప‌వ‌న్‌. ఇప్పుడు మ‌ళ్లీ అదే మాట చెప్పి ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చాడు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అలుపెరుగ‌ని పోరాటం చేస్తాన‌ని.. కావాలంటే సినిమాల‌కు దూరం అవ్వ‌డానికి కూడా తాను రెడీగానే ఉన్నాన‌ని చెప్పుకొచ్చాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. జ‌న‌సేన కార్యాల‌యంలో అనంత‌పురం నుంచి వ‌చ్చిన 150మంది ప్ర‌తినిధుల‌తో ప‌వ‌న్ స‌మావేశం అయ్యాడు. ఈ సంద‌ర్భంగా రాజ‌కీయాల‌పై, సినీ జీవితం గురించీ ప‌వ‌న్ మాట్లాడాడు.

తన‌ని పార్ట్ టైమ్ రాజ‌కీయ వేత్త అంటున్నార‌ని, చాలామంది రాజ‌కీయ నాయ‌కులు ఇంట్లో కూర్చుని రాజ‌కీయం చేస్తున్నార‌ని, తాను మాత్రం అలాంటివాడ్ని కాద‌ని, వీలైతే సినిమాల‌కు దూర‌మై పూర్తి స్థాయిలో ప్ర‌జా సేవ చేస్తాన‌ని స్ప‌ష్టంచేశాడు ప‌వ‌న్‌. `సినిమాలంటే నాకు గౌర‌వ‌మే. నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది సినిమాలే. నా సిబ్బంది కోసం, వాళ్ల జీత భ‌త్యాల కోసం సినిమాల్లో న‌టిస్తున్నా. ప్ర‌జ‌ల కోసం.. సినిమాల్ని తాత్కాలికంగా పక్క‌న పెట్టి సేవ చేయ‌డానికి సిద్దంగా ఉన్నా` అన్నాడు.

వచ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని, అనంత‌పురం జిల్లా నుంచే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో దిగుతాన‌ని మ‌రోసారి చెప్పాడు. త్వ‌ర‌లో పాద‌యాత్ర కూడా చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. మ‌రి అటు ఒకేసారి అటు ఒక తీపి, చేదు కబురుచెప్పిన ప‌వ‌న్‌.. ముందు ముందు ఇంకెన్ని షాక్‌లు ఇస్తాడో వేచిచూడాల్సిందే!!