మాట‌లతో కానిది భేటీతో సాధ్య‌మైందా? 

మాట‌ల వ‌ల్ల చెప్ప‌లేనిది మీటింగుల వ‌ల్ల సాధ్య‌మ‌వుతుంది. ఇప్పుడు అలాంటి ఒకే ఒక్క మీటింగ్ ఏపీ రాజ‌కీయాల్లో సెగ‌లు పుట్టిస్తోంది. వైసీపీ నేత‌ల్లో జోష్ నింపుతోంది. ఇదే స‌మ‌యంలో టీడీపీ నేత‌లను తీవ్ర క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. ప్ర‌ధాని మోదీతో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ భేటీ.. ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను మార్చ‌బోతోంది. 2019లో జ‌గ‌న్ జైలుకు ఖాయ‌మ‌ని, ఇక అధికారం శాశ్వ‌తమ‌ని భావిస్తున్న నేత‌ల‌కు ఒక్క‌సారిగా గొంతులో వెల‌గ‌పండు ప‌డినంత ప‌నయింది. ఇదే సంద‌ర్భంలో పార్టీ అస్థిత్వాన్ని కాపాడుకునే స‌రైన అవ‌కాశం కూడా జ‌గ‌న్‌కు దొరికింది. `నేనే సీఎం` మాట‌ల‌కంటే ఈ భేటీ మ‌రింత బాగా పనిచేసే అవ‌కాశ‌ముంద‌నేది విశ్లేష‌కుల అంచ‌నా!!

ప్రభుత్వాల దమన కాండలో అధికారంలో లేని నాయకులు త‌మ‌ పార్టీని బ‌తికించుకోవడం అంటే మాటలు కాదు. అందుకే వైఎస్ జగన్ `నేనే సిఎం, మూడేళ్ల‌లో మనదే అధికారం, రెండేళ్ల‌లో మన ప్రభుత్వం వస్తుంది` అంటూ ఓటర్ల‌ను, నాయకులను కాపాడుకోవడానికి, తనను, తన పార్టీ నాయకులను ఇబ్బందులు పెడుతున్న అధికారులను హెచ్చరించడానికి ఎన్నో మాటలు చెప్పారు. కానీ ఆ మాటలు వినీవినీ జ‌నం బోర్ ఫీల‌వుతున్నారు. కానీ ఆ మాటల వల్ల‌ సాధ్యం కానిది మోదీ మీటింగ్‌తో సాధ్యమవుతుందని టీడీపీ నేతలు విశ్వ‌సిస్తున్నారు.

`జగన్ త్వరలో జైలుకు పోతాడు, 2019లో కూడా మా ప్రభుత్వమే వస్తుంది` అని చెప్తూ అందరినీ మేనేజ్ చేస్తున్నాడు చంద్రబాబు. ఇప్పుడు మోదీతో జ‌గ‌న్ మీటింగ్ పుణ్యమాని ఆ డైలాగ్‌ల‌కు విశ్వసనీయత లేకుండా పోయింది. ప్రధాన మంత్రి అండ ఉండ‌టంతో జ‌గ‌న్‌కు ఢోకా లేద‌ని తేలిపోయింది. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా జగన్‌ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి, చంద్ర‌బాబుకు స‌న్నిహితుడైన‌ వెంకయ్య కూడా మౌనవ్రతం పాటిస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి జగన్‌కి మోదీ సపోర్ట్ ఉన్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ విష‌యం రాజకీయ నాయకులకు అర్థమైతే వైకాపాలోకి జంప్ చేసే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగే అవ‌కాశాలు లేక‌పోలేదు.

అత్యున్నత స్థాయి అధికారులు జగన్‌తో పెట్టుకోవడానికి మరీ ఉత్సాహం చూపించరు. జగన్ కేసుల్లో సాక్షులుగా ఉన్నవాళ్ల‌ వాయిస్‌లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఓటుకు నోటు కేసు వీగిపోవడం, జగన్‌పై ఉన్న కేసుల్లో జగన్ జైలుకు పోవడం లాంటి రెండు ప్రధాన లక్ష్యాలతోనే ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, రైల్వే జోన్‌లాంటి రాష్ట్ర ప్రాధాన్యతలను ఫణంగా పెట్టి మరీ మోడీ దగ్గర సాగిలపడుతున్నాడు చంద్రబాబు. ఇప్పుడు జగన్ జైలుకు పోవడం అనే లక్ష్యం నెరవేరడం అనుమానంగా కనిపిస్తోంది. మ‌రి ఇప్పుడు ఆయ‌న నిర్ణ‌యం ఏమిటో వేచిచూడాల్సిందే!!