లోకేష్ ముందు వాళ్ళ ఆటలు సాగవా?

మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి అటు ప్ర‌జ‌ల్లోనూ, ఇటు పార్టీలో త‌న ప‌ట్టు పెంచుకునేందుకు సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. సీనియ‌ర్ మంత్రులు ఉన్నా.. వారి వ్య‌వ‌హారాలు కూడా ఆయ‌నే ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. ఇప్పుడు త‌నతోపాటు మంత్రి వ‌ర్గంలో చేరిన వారి వంతు వచ్చింది. కేవ‌లం వారిది మంత్రి వ‌ర్గంలో నామ‌మాత్ర‌పు పాత్రేన‌ని తేలిపోయింది. మంత్రులే అయినా వారి పీఏ, పీఆర్వోల‌ను కూడా నియ‌మించుకోలేని ప‌రిస్థితి. త‌మ సిబ్బందిని కూడా లోకేష్ స్వ‌యంగా నియ‌మించ‌డంతో.. అవాక్క‌వ‌డం వారి వంత‌యింద‌ట‌. పాపం అన్నీ చిన్న‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతుండ‌టంతో ఇక ప‌ద‌వి నామ‌మాత్ర‌మే అనిపిస్తోంద‌ట‌.

మంత్రుల‌యిన ఫిరాయింపుదారుల‌కు చిన‌బాబు పెద్ద షాక్ ఇచ్చారు. `మంత్రి కుర్చీలోకి వ‌చ్చేశాం. ఇక మ‌న‌దే రాజ్యం` అని అనుకున్న వారికి ఇప్పుడిప్పుడే త‌త్వం బోధ‌ప‌డుతోంద‌ట‌! మంత్రి ప‌ద‌వి వారికి కేవ‌లం అలంకారం మాత్ర‌మేన‌ని తేలిపోయింద‌ట‌. ఇలాంటి అనుభ‌వ‌మే మంత్రి సుజ‌య్ కృష్ణ‌రంగాకు ఎదురైంద‌ట‌. సాధార‌ణంగా త‌మ ప‌ర్స‌న‌ల్ సిబ్బందిని మంత్రులే నియ‌మించుకుంటారు. త‌మ‌కు కావాల్సిన వారిని ఇందులో నియ‌మించుకోవాల‌ని వీరు కూడా భావించార‌ట. కానీ పేషీలో కూర్చోగానే ఒక వ్య‌క్తి వ‌చ్చి.. `నేనే మీ పీయే` అనీ, మ‌రొక‌రు `నేనే మీ పీఆర్వో` అంటూ ప‌రిచ‌యాలు చేసుకున్నార‌ట‌! దీంతో బొబ్బిలి రాజు ఒక్క‌సారిగా షాక్ అయ్యార‌ట‌.

తాము లోకేష్ బాబు పంపిస్తే వ‌చ్చామ‌ని, ఆయ‌నే త‌మ‌ని నియ‌మించార‌ని చెప్ప‌డంతో మ‌రో షాక్ అయ్యార‌ట‌. కాస్త అటు ఇటుగా ఇత‌ర జంప్ జిలానీ మంత్రుల‌కూ ఇలాంటి అనుభ‌వాలే ఈ మ‌ధ్య వ‌రుస‌గా ఎదుర‌వుతున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. త‌న‌తోపాటు మంత్రులుగా ప్ర‌మాణం చేసిన‌వారి బాధ్య‌త‌ల్ని కూడా అప్ర‌క‌టితంగా నారా లోకేష్ చూసుకుంటున్నారు. అంతేగాక చంద్ర‌బాబు క్యాబినెట్ లో ఉన్నఇత‌ర మంత్రుల పేషీల్లోనూ చిన‌బాబు చెప్పిందే జ‌రుగుతోంద‌ట‌. ఆయ‌న మంత్రికాక ముందే బదిలీలు, నియామ‌కాలు చూసుకునేవారనేది తెలిసిందే!

జంప్ జిలానీల‌కు ఈ అనుభ‌వం కాస్త కొత్త మ‌రి. మొత్తానికి, ఫిరాయింపు మంత్రుల‌కు తత్వం బోధ‌ప‌డింది. ఇక‌పై వారు ఎలా ఉండాలో.. ఎలా వ్య‌వ‌హ‌రించాలో.. ఎలా నిర్ణ‌యాలు తీసుకోవాలో అన్నీ స్పూన్ ఫీడింగ్ అన్న‌మాట‌! మంత్రులం క‌దా.. స్వ‌తంత్రంగా ఆలోచిస్తాం అంటే కుద‌ర‌దు. ఇక వాళ్లంతా లోకేష్ బాబు చెప్పినట్టు వినాల్సిందే!!