రేవంత్‌పై ఉన్న న‌మ్మ‌కం టీడీపీపై లేదా? 

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ స‌ర్వేలు కూడా జోరందుకుంటాయి. ఇందులో కొన్ని స‌ర్వేలు ఆశ్చ‌ర్య‌కంగానూ, మ‌రికొన్ని షాకింగ్‌గానూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణాలో నిర్వ‌హించిన ఒక స‌ర్వేలో షాకింగ్ ఫ‌లితాలు వచ్చాయి. ముఖ్యంగా ఇవి తెలుగుదేశం, కాంగ్రెస్‌కు పార్టీల‌కు ఒక తీపి, ఒక చేదు వార్త‌ను అందించాయి. ముఖ్యంగా తెలంగాణ‌లో సీఎం కేసీఆర్.. అత్యంత పాపుల‌ర్ నాయ‌కుడు. వారి త‌ర్వాత ఎవ‌రు అంటే? కేటీఆర్‌, హ‌రీశ్‌రావు ఇలా పేర్లు వినిపిస్తుంటాయి. కానీ ఈ స‌ర్వే ప్ర‌కారం కేసీఆర్ త‌ర్వాత.. అంత‌టి పాపులారిటీ గ‌ల నాయ‌కుడు ఎవ‌రంటే.. టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డేట‌న‌! ఇక తెలంగాణ‌లో కాంగ్రెస్ క్ర‌మంగా రెండో స్థానంలో నిలిచింద‌ని స‌ర్వేలో తేలింది.

తెలంగాణ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ గ‌ల కేసీఆర్ త‌రువాతి స్థానం.. టీ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిదే. ఇంకో విశేషం ఏంటంటే… పాపులారిటీలో రేవంత్ కు స‌మీపంలో ఇత‌ర నాయ‌కులెవ్వ‌రూ లేర‌ట‌. బెంగ‌ళూరుకు చెందిన ఒక సంస్థ తెలంగాణ‌లో స‌ర్వే తాజాగా నిర్వ‌హించింది. రాష్ట్రంలో ఏయే పార్టీ త‌ర‌ఫున ఏయే నాయ‌కుడిని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌జ‌లు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఏ పార్టీకి 2019లో అధికారంలోకి వ‌చ్చే ఛాన్సులు మెండుగా ఉన్నాయి..? ఇలాంటి అంశాల‌పై పొలిటిక‌ల్ కోషియంట్ అనే సంస్థ ఒక స‌ర్వే నిర్వ‌హించింది. ఆ స‌ర్వే ఫ‌లితాలు ఇలా ఉన్నాయి. ఇందులో ప‌లు ఆసక్తిక‌ర అంశాలు వెల్ల‌డ‌య్యాయి.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు అనుకూలంగా తెలంగాణ‌లో 47.45 శాతం మంది మాట్లాడారు. ఇక‌, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే ఆలోచ‌న‌కు మ‌ద్ద‌తుగా 19.6 శాతం ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తీకరించారు. కాంగ్రెస్ త‌ర‌ఫున సీఎం అభ్య‌ర్థులుగా ఇద్ద‌రు పేర్లు వినిపించాయి! ఈ రేసులో ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడు జానారెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డిలు రేవంత్ కు చాలా దూరంలో ఉన్నార‌ట‌. జానాకి అనుకూలంగా 13 శాతం స్పందించారు. ఉత్త‌మ్ సీఎం అభ్య‌ర్థిత్వానికి కేవ‌లం 7 శాతం మాత్ర‌మే అనుకూలంగా ఉన్నారు. రాష్ట్రంలో మ‌రోసారి తెరాస అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టుగా 43.1 శాతం మంది చెప్పారు. కాంగ్రెస్ కు అధికారం ద‌క్కుతుంద‌ని 22.95 శాతం అభిప్రాయ‌ప‌డ్డారు.

తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాన్ని 16.24 శాతం మంది ఇచ్చారు. ఆ త‌రువాతి స్థానంలో భాజ‌పా ఉంది. కేసీఆర్ త‌ర్వాత‌ రాష్ట్రంలో బాగా పాపులారిటీ రేవంత్ రెడ్డి ద‌క్కించుకున్నా అధికారంలోకి వ‌చ్చే పార్టీలో టీడీపీ మాత్రం రెండో స్థానంలో లేద‌ట‌. అంటే, రేవంత్ పై మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఎక్కువ‌.. టీడీపీపై త‌క్కువ అనేది అర్థ‌మౌతోంది. తెలంగాణ‌లో కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతోంద‌ని ఇక్క‌డ కూడా తేలింది. ఈ విష‌యం గ్ర‌హించిన కేసీఆర్‌.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు వ‌రాలు కురిపిస్తున్నారు.