తెలుగు గ‌డ్డ‌పై మ‌రో కొత్త పార్టీ

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, వైసీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కొత్త‌గా ఆవిర్భ‌వించిన జ‌న‌సేన‌.. ఇంకా కొన్ని చిన్న చిన్న‌ పార్టీలు లెక్కకు మంచి ఉండ‌నే ఉన్నాయి. వీటిలోనే ఏ పార్టీ ఓటు వెయ్యాలా అని ఓట‌ర్లు గంద‌ర‌గోళ‌ప‌డుతుంటే ఇప్పుడు మ‌రో పార్టీ రాబోతోంది. అదికూడా టీఆర్ఎస్ బ‌లంగా ఉన్న తెలంగాణ‌లో కొత్త పార్టీ పురుడుబోసుకోబోతోంది. ఇప్ప‌టికే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆకర్షించేందుకు సీఎం కేసీఆర్ ప‌క్క‌గా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తుంటే.. ఆ పార్టీ మాజీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు చెరుకు సుధాక‌ర్ కొత్త వేదిక‌ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

కొంత‌కాలం నుంచీ తెలంగాణ‌లో కొత్త రాజ‌కీయ వేదికకు తెర‌లేవ‌బోతోంద‌నే ప్ర‌చారం జోరుగా జ‌రిగింది. దీనికి జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రామ్ నాయ‌క‌త్వం వ‌హించ‌బోతార‌ని, ఇక ఇత‌ర పార్టీల నంచి భారీగా వ‌ల‌స‌లు జోరందుకుంటాయ‌ని ఊహాగానాలు వినిపించాయి. కానీ అంత‌కు ముందే ఇప్పుడు చెరుకు సుధాక‌ర్ నేతృత్వంలో రాజ‌కీయ వేదిక‌కు రూప‌క‌ల్ప‌న జ‌రిగింది. ఇంకో ఆసక్తిక‌ర విష‌మేమిటంటే.. సీఎం కేసీఆర్‌కు సుధాక‌ర్ మంచి ఆప్తుడు!! ఇప్పుడు ఆయ‌నే టీఆర్ఎస్‌, కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా సొంత వేదికను మొదలుపెట్టారు.

సీఎం కేసీఆర్ సన్నిహితుడిగా పేరున్న టీఆర్ఎస్ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ తన పార్టీ ప్రకటన చేశారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం తన సొంత పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ఆయ‌న‌.. తాజాగా జూన్ 2 పార్టీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఇంటిపార్టీ కన్వీన‌ర్‌గా ఉన్న సుధాకర్ గన్‌పార్క్‌ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జెండా ఊపి బస్సుయాత్రను ఆయన ప్రారంభించారు. టీఆర్ఎస్‌లో కుటుంబ ఆకాంక్షలకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెరుకు సుధాకర్ విమర్శించారు.

ఇప్పుడున్నప్రభుత్వానికి 2001లో పుట్టిన టీఆర్ఎస్‌కు లక్షణాల్లేవని వ్యాఖ్యానించారు. ఆత్మాభిమానం చంపుకొని కొందరు టీఆర్ఎస్లో కొనసాగుతున్నారని చెప్పారు. జేఏసీలో పనిచేసిన వారు రాజకీయ అనాధలుగా మిగిలిపోయారని అన్నారు. అలాంటి వారందరికీ రాజకీయ వేదికే తెలంగాణ ఇంటిపార్టీ అని చెప్పారు. రాజకీయాలను శాసిస్తే 2019లో నిర్ణయాత్మక శక్తిగా మారతామని అన్నారు. మ‌రి అనేక సంక్షేమ ప‌థ‌కాల‌తో దూసుకుపోతున్న కేసీఆర్‌ను నిలువ‌రించ‌డానికి కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలో స‌రిపోవడం లేదు. మ‌రి ఈ కొత్త పార్టీ మ‌నుగ‌డ ఎలా ఉంటుందో!!