కేజ్రీవాల్‌తో బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్‌

పార్టీలో కుమ్ములాటలు.. సొంత నాయ‌కుల మధ్యే అభిప్రాయ‌భేదాలు.. నేత‌ల‌పై కేసులు.. వెర‌సి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఓట‌మి.. `సామాన్యుడి`ని తీవ్రంగా వేధిస్తున్నాయి. అంతేగాక ఆయ‌న సీఎం పీఠానికి ఎస‌రు పెట్టేలా చేస్తున్నాయి. బీజేపీ హ‌వా దేశంలో న‌డుస్తున్న రోజుల్లో.. దానిని త‌ట్టుకుని సీఎం పీఠాన్ని ఎక్క‌డ‌మంటే మామూలు విష‌యం కాదు! అందులోనూ ఒక సామాన్యుడు గెల‌వ‌డమంటే దేశం మొత్తం నివ్వెర‌పోయింది. కానీ అప్పుడు పొగిడిన వాళ్లే ఇప్పుడు తిడుతున్నారు. ఆమ్ ఆద్మీ అంటూ స్థాపించిన పార్టీకి ఆ `ఆమ్ ఆద్మీ` దూర‌మవుతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీలో కుమ్ములాట‌లు బీజేపీకి వ‌రంలా మారాయి.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీఎం సీటుకు ఎసరు పెడుతున్నారా? అంటే అవునంటున్నాయి బీజేపీ వర్గాలు. ఆ దిశగానే ఢిల్లీ రాజకీయాలు ముందుకు సాగుతున్నాయని ఈ పరిణామాం ఎప్పుడైనా జరగొచ్చని చెబుతున్నారు. ఢిల్లీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం.. ఆప్ అధినేత‌ను తీవ్రంగా క‌లిచివేస్తోంది. అంతేగాక పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాల‌ను సృష్టిస్తోంది. వీటిని బీజేపీ స‌రిగ్గా ఉప‌యోగించుకుంటోంది. దేశవ్యాప్తంగా పట్టు సాధించేందుకు వేగంగా పావులు కదుపుతున్న బీజేపీ ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది. అంతేగాక కేజ్రీవాల్‌పై స‌రికొత్త మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది.

బీజీపీ కీలక నేత చేసిన సంచలన వ్యాఖ్యలు ఒక్కసారిగా డిల్లీ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. అధికార ఆప్‌కు చెందిన 34 మంది ఎమ్మెల్యేలు సీఎం కేజ్రీవాల్‌ పట్ల అసంతృప్తిగా ఉన్నారని, వారంతా వేరుకుంపటి పెట్టి ఆప్‌ కీలక నేత కుమార్‌విశ్వాస్‌ ను ముఖ్యమంత్రిగా ఎన్నుబోతున్నారంటూ ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి పాల్‌ ఎస్‌ బగ్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం 34 ఆప్‌ ఎమ్మెల్యేలు అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామాకు పట్టుపట్టినట్లు బగ్గా తెలిపారు.

అయితే ఈ వ్యాఖ్యలను ఆప్‌ నేత కుమార్‌ విశ్వాస్‌ ఖండిచారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని, అందుకే పార్టీకి ఓట్లు దక్కలేదని, అయితే ఆత్మ పరిశీలన చేసుకొని తిరిగి పుంజుకుంటామని కుమార్‌విశ్వాస్‌ తెలిపారు. సీఎం కేజ్రీవాల్‌ వాదనకు విరుద్ధంగా..”ఓటర్లు ఓట్లువేయనప్పుడు ఈవీఎం లను విమర్శించడం తగదు” అని ఆయన అన్నారు. మ‌రి ఇప్ప‌టికైనా సంక్షోభాలు ప‌క్క‌న‌పెట్టి పాల‌న‌పై కేజ్రీవాల్ దృష్టిసారిస్తారో లేక బీజేపీ వ‌ల‌లో చిక్కుకుపోతారో!!