నంద్యాల టెన్ష‌న్ బాబుకు తీరిన‌ట్టేనా 

నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీచేయాల‌నే అంశంపై టీడీపీలో కొంత‌కాలంగా సందిగ్ధం నెల‌కొంది. త‌మ వ‌ర్గానికి కేటాయించాల‌ని మంత్రి అఖిల‌ప్రియ వ‌ర్గం.. త‌మ వ‌ర్గానికే కేటాయించాల‌ని శిల్పా వ‌ర్గం ప‌ట్టుబ‌ట్ట‌డంతో.. ఇప్ప‌టివ‌ర‌కూ కొంత అనిశ్చితి నెల‌కొంది. అంతేగాక ఈ విష‌యంలో అధినేత‌ చంద్ర‌బాబు కూడా టెన్ష‌న్ ప‌డ్డారు. అయితే ఇప్పుడు ఆ టెన్ష‌న్ తీరిపోయింది. శిల్పా, భూమా వ‌ర్గాల మ‌ధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ వ‌ర్గాల‌ను ఒకే తాటిపైకి తీసుకురావ‌డంలో సీనియ‌ర్ మంత్రులు స‌ఫ‌లీకృతుల‌య్యారు!

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఎవ‌రిని దించాల‌నే అంశంపై మంత్రులు క‌ళా వెంక‌ట్రావు, నారాయ‌ణ‌ ఈ రోజు మంత్రి అఖిల‌ప్రియతో చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. అనంత‌రం వారంతా క‌లిసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి ఇంటికి వెళ్లారు. క‌ళా వెంక‌ట్రావుతో చ‌ర్చ‌ల ఫ‌లితంగా భూమా, శిల్పా వ‌ర్గీయులు చెరో మెట్టు దిగారు. నంద్యాల అభ్య‌ర్థి అంశంపై నిర్ణ‌యాన్ని చంద్ర‌బాబుకే వ‌దిలేస్తున్న‌ట్లు ఇరువురూ ప్ర‌క‌టించారు. ఏ నిర్ణ‌యం తీసుకున్నా అంతా క‌లిసే పార్టీ కోసం ప‌నిచేస్తామ‌ని అన్నారు.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబుతో వారు చ‌ర్చిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ ఏ నిర్ణ‌యం తీసుకుంటారోనన్న ఆస‌క్తి నెల‌కొంది. సాధార‌ణంగా సానుభూతి భూమా కుటుంబంపై ఉంటుంది క‌నుక ఆ వ‌ర్గానికి చెందిన వారికి కేటాయిస్తే.. విజ‌యం సాధించ‌వ‌చ్చ‌నేది సీఎం అభిప్రాయం. అయితే వైసీపీ నుంచి కూడా గ‌ట్టి పోటీ ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. భూమా నాగిరెడ్డి వైసీపీ టికెట్‌పై గెల‌వ‌డంతో.. ఆ సీటు త‌మ‌దేన‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ నొక్కి చెబుతున్నారు. ఇక శిల్పా వ‌ర్గం కూడా ఈ సీటు ద‌క్కించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. మ‌రి అధినేత ఎవ‌రిని ప్ర‌కటిస్తారో? ఆ వ్య‌క్తి గెలుపున‌కు ఈ రెండు వ‌ర్గాలు ఎంత వ‌ర‌కూ క‌లిసి ప‌నిచేస్తాయో వేచిచూడాల్సిందే!