కేసీఆర్ స‌ర్వేపై సొంత పార్టీలోనే లుక‌లుక‌లు!

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న పాల‌న‌, మంత్రుల ప‌నితీరు, ఎమ్మెల్యేల వ్య‌వ‌హార‌శైలి వంటి ప్ర‌ధాన అంశాల‌పై చేయించిన స‌ర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు, ఐటీ మంత్రి కేటీఆర్‌కి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నార‌ని స‌ర్వే వెల్ల‌డించింది. ఇక‌, మేన‌ల్లుడు, మ‌రో మంత్రి హ‌రీశ్‌రావు ప‌రిస్థితి ఫ‌ర్వాలేదు..అని స‌ర్వే తెలిపింది. ఇక‌, టీఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ప‌రిస్థితి దిగ‌జారుతోంద‌న్న‌ట్టుగా స‌ర్వే వివ‌రించింది.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఈ స‌ర్వే పైనే స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప‌ట్టుమ‌ని మూడు నెల‌ల కింద‌ట అంటే మార్చిలో ఇదే విధంగా స‌ర్వే చేయించిన కేసీఆర్‌.. అప్ప‌టి ఫ‌లితాల‌కు, ఇప్ప‌టి ఫ‌లితాల‌కు మ‌ధ్య పెద్ద వ్య‌త్యాసం లేద‌ని ప్ర‌క‌టించ‌డం, మరీ ముఖ్యంగా సీఎంగా త‌న గ్రాఫ్‌, మంత్రిగా త‌న కుమారుడి గ్రాఫ్‌లు ఎక్క‌డా ప‌డిపోలేద‌ని చెప్ప‌డంపై సొంత పార్టీలోనే గులాబీ ద‌ళం నివ్వెర‌పోతోంది. అంతేనా.. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ. మాస్ లీడ‌ర్ లెక్క గుర్తింపు పొందిన హ‌రీశ్ రావుకు మార్కులు త‌గ్గ‌డంపైనా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

నిజానికి ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితిలో టీఆర్ ఎస్‌కి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా విప‌క్షాల ఆందోళ‌న‌లు మున్నంటాయి. రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వంగా ప్ర‌చారం చేయ‌డంలో కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు స‌క్సెస్ అయ్యాయి. రైతుల చేతికి బేడీలు వేయ‌డం, పోలీసుల‌తో కుళ్ల‌బొడిపించ‌డం వంటి విష‌యాల‌ను విప‌క్షాలు త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకున్నాయి. అదేవిధంగా విద్యార్థులు కూడా ఆందోళ‌న‌లు ముమ్మ‌రం చేశారు.

ఇన్ని జ‌రుగుతున్నా.. కూడా ప్ర‌జ‌ల్లో త‌న‌కు వ్య‌తిరేక‌త లేద‌ని కేసీఆర్ సొంత స‌ర్వేలో ప్ర‌క‌టించుకోవ‌డం, అదేస‌మ‌యంలో సిద్దిపేటలో మంత్రి హ‌రీశ్‌రావు నిత్యం ప్ర‌జ‌ల్లో అందుబాటులో ఉంటూ వారి స‌మ‌స్య‌లు తీరుస్తూ.. ఉన్నా ఆయ‌న కు ఆద‌ర‌ణ త‌గ్గుతోంద‌నే యాంగిల్‌లో త‌క్కువ మార్కులు రావ‌డం వంటి వాటిని టీఆర్ ఎస్ నేత‌లే బ‌హిరంగంగా విమ‌ర్శిస్తున్నారు. ఈ స‌ర్వేలో ఏదోలోపం ఉంద‌నే మాట వారి నుంచి విన‌బ‌డుతోంది. మ‌రి కేసీఆర్ వీరికి ఎలా స‌మాధానం చెబుతారో చూడాలి!