టీడీపీ ఎంపీకి బీజేపీ ఆఫ‌ర్‌..!

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వ‌స్తాయో చెప్ప‌డం క‌ష్టం. ముఖ్యంగా తాము కోరుకున్న ప‌నులు నెర‌వేర‌క‌పోతే.. నేత‌లు ఎంత‌కైనా తెగిస్తార‌నేది పాలిటిక్స్‌లో మామూలే! ఏళ్ల త‌ర‌బ‌డి కాపు కాచిన పార్టీల‌ను సైతం ఒక్క క్ష‌ణంలో వ‌దిలేసిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్ప‌డు ఇదే జాబితాలోకి న‌ర‌స‌రావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు చేర‌నున్నార‌ట! కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నేత‌గా ఉన్న ఆయ‌న రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో 2014లో టీడీపీ తీర్థం పుచ్చుకుని న‌ర‌స‌రావు పేట నుంచి ఎంపీగా గెలిచారు.

ఇటీవ‌ల ఆయ‌న టీటీడీ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌విని కావాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబును బ‌లంగా డిమాండ్ చేశారు. దీనికి అవ‌స‌ర‌మైతే.. తాను ఎంపీ ప‌ద‌వికి ఇప్పుడే రాజీనామా చేస్తాన‌ని కూడా చెప్పారు. అయినా కూడా చంద్ర‌బాబు క‌రుణించ‌లేదు. జోడు ప‌ద‌వులు కుద‌ర‌ద‌ని ఖ‌రాకండీగా చెప్పారు. దీంతో నొచ్చుకున్న రాయ‌పాటి.. తాజాగా విశాఖ‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్న మ‌హానాడుకు దూరంగా ఉండిపోయారు.

ఇంత‌లో ఓ పిడుగు లాంటి వార్త ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. రాయ‌పాటికి బీజేపీ నుంచి ఓ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని ఆ వార్త సారాంశం. బీజేపీ సీనియ‌ర్ నేత‌ల స‌ల‌హాతో నేరుగా ప్ర‌ధాని మోడీయే రాయ‌పాటిని క‌మ‌ల ద‌ళంలో చేర్చుకునేందుకు రెడీ అయ్యార‌ట‌. ఈ క్ర‌మంలో రాయ‌పాటి గురించి పూర్తిగా వాక‌బు కూడా చేశార‌ట మోడీ. అయితే, దీనిపై ‘రాయపాటి’ పెద్దగా స్పందించలేదని స‌మాచారం. ‘తనకు చంద్రబాబు 30సంవత్సరాల నుంచి సన్నిహిత మిత్రుడని, అటువంటి నాయకుణ్ని వదులుకుని వేరే పార్టీలోకి వెళ్లే పరిస్థితి రాదని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

ఒక వైపు ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న బీజేపీ.. ఇప్పుడు మ‌హానాడుకు వెళ్ల‌ని టీడీపీ అసంతృప్తుల‌పై వ‌ల విసురుతున్న‌ట్టు తెలుస్తోంది. వీరిని బీజేపీలో చేర్చుకోవ‌డం ద్వారా బ‌ల‌ప‌డాల‌ని భావిస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.