వైసీపీలోకి ర‌ఘువీరా…జ‌గ‌న్ ఆఫ‌ర్ ఇదేనా..!

రాష్ట్ర విభ‌జ‌న దెబ్బ‌కు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా అని గుర్తు చేసుకోవాల్సిన ప‌రిస్థితి. రాష్ట్ర విభ‌జ‌న పాప‌మంతా కాంగ్రెస్ పార్టీ నెత్తిమీదే ప‌డ‌డంతో ఆ పార్టీ ఇప్ప‌ట‌కీ కోలుకునే ప‌రిస్థితి లేదు. విభ‌జ‌న త‌ర్వాత 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోటీచేసిన కాంగ్రెస్‌కు ఏ నియోజ‌క‌వ‌ర్గాల్లో డిపాజిట్లు వ‌చ్చాయో భూత‌ద్దంలో పెట్టి వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్ప‌ట‌కీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ మూలాలు అక్క‌డ‌క్క‌డా ఉన్నా ? పార్టీని న‌డిపించే నాయ‌కుడే స‌రైన వాడు లేకుండా పోయాడు.

మెగాస్టార్ చిరంజీవి ఉన్నా…ఆయ‌న సినిమాల్లో న‌టిస్తూ రాజ‌కీయంగా కొత్త‌దారులు వెతుక్కుంటున్నాడ‌న్న చ‌ర్చ‌లు విన‌వ‌స్తున్నాయి. ఇక ఏపీ పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న ర‌ఘువీరారెడ్డి సైతం ఇప్పుడు రాజ‌కీయంగా కొత్త‌దారులు వెతుక్కుంటున్నాడా ? అంటే అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. లేటెస్ట్ టాక్ ప్ర‌కారం ఏపీ పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న ర‌ఘువీరా రెడ్డిని మార్చే ఆలోచ‌న‌లో ఉన్నార‌నీ, యువ‌త‌కు అవ‌కాశం ఇచ్చేందుకు హైక‌మాండ్ సిద్ధ‌మౌతోంద‌నే క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

ఈ క‌థ‌నాల సంగ‌తి ఎలా ఉన్నా కాంగ్రెస్‌లో ఫ్యూచ‌ర్ లేద‌ని డిసైడ్ అయిన ర‌ఘువీరా వైసీపీ వైపు చూస్తున్నార‌ట‌. ర‌ఘువీరా వైసీపీలో జాయిన్ అయితే ఆయ‌న‌కు క‌ళ్యాణ‌దుర్గం లేదా పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డో ఓ చోట ఎమ్మెల్యే టిక్కెట్టు ఆఫ‌ర్ కూడా జ‌గ‌న్ నుంచి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నికల నాటికి అనంత‌పురం జిల్లాలో స్ట్రాంగ్ అయ్యేందుకు వీలున్న ప్ర‌తి అవ‌కాశాన్ని వాడుకుంటోన్న జ‌గ‌న్ ర‌ఘువీరాపై వ‌ల వేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే జిల్లాలో కొత్తగా రెండు నియోక‌జక‌వ‌ర్గాలు రానున్నాయి. అప్పుడు ర‌ఘువీరా కోరుకున్న చోటే జ‌గ‌న్ ఎమ్మెల్యే సీటు ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. మ‌రి ర‌ఘువీరా కాంగ్రెస్‌కు టాటా చెప్పి జ‌గ‌న్ చెంత‌కు చేర‌తాడేమో చూడాలి.