నంద్యాల‌లో టీడీపీకి భారీ షాక్‌..సీమ‌లో బాబు లెక్క తప్పిందా..!

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాలు టీడీపీ అధినేత‌కు త‌ల‌నొప్పిగా మారాయి. ఇటీవ‌లె మృతిచెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరిక‌తో ఇక్క‌డ విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. భూమా మృతి త‌ర్వాత‌.. నంద్యాల‌లో పూర్తి ప‌ట్టు సాధించాల‌ని భావిస్తున్న శిల్పా వ‌ర్గానికి ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ఉప ఎన్నిక‌ల్లో భూమా వ‌ర్గానికి సీటు కేటాయించాల‌ని అధిష్ఠానం నిర్ణ‌యించ‌డంతో మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహ‌న్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ ప‌రిణామంతో రాయ‌ల‌సీమ‌లో టీడీపీకి ఇబ్బందేన‌ని అంచ‌నా!

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ‌ ప్రాంతంలో ప‌ట్టు సాధించామ‌ని ఉత్సాహంతో ఉన్న టీడీపీకి.. గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌రువాత నంద్యాల‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్క‌డ వైసీపీ కూడా బ‌రిలోకి దిగే అవకాశాలు ఉండటంతో.. పోటీ హోరాహోరీగా జ‌ర‌గ‌నుంది. ఇదే స‌మ‌యంలో టీడీపీకి సెంటిమెంట్ కూడా క‌లిసి వ‌స్తోంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే అఖిల ప్రియ‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. దీంతోపాటు ఉప ఎన్నిక‌లోనూ అదే ఫ్యామిలీ నుంచి ఒక‌రికి సీటు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. భూమా కుటుంబానికే సీటు ఇస్తే గెలుపు సులువు అవుతుంద‌ని టీడీపీ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

భూమా నాగిరెడ్డి సోద‌రుడి కొడుకు బ్ర‌హ్మానంద‌రెడ్డి పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. సో.. ఈ క్ర‌మంలో శిల్పా వ‌ర్గానికి సీటు ద‌క్కే ప‌రిస్థితి లేద‌న్న‌ది సుస్ఫష్టంగా ఉంది. ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి త‌న‌కు సీటు ద‌క్కే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో శిల్పా మోహ‌న్ రెడ్డి పార్టీని వీడే అవ‌కాశం ఉన్న‌ట్టు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. ఇదే విష‌యమై అనుచరుల‌తో శిల్పా చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ఉప ఎన్నిక‌ల్లో వైకాపా త‌ర‌ఫున టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయింద‌ని స‌మాచారం.

ఇక టీడీపీలో ఉండటం క‌న్నా వైసీపీలో చేరేందుకు స‌న్నాహాలు దాదాపుగా పూర్తి చేసుకున్నార‌నీ తెలుస్తోంది. మైనార్టీ ఓట్ల శాతం ఎక్కువ‌గా ఉండ‌టంతో, వైకాపా అభ్య‌ర్థి గెలుపు సులువు అనే అంచ‌నాతో శిల్పా వ‌ర్గం ఉంది. ఒక‌వేళ ఇప్పుడీ ఉప ఎన్నిక‌ల్లో సానుభూతి వ‌ర్కౌట్ అయినా.. 2019లో శిల్పా గెలుపు సులువు అని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నార‌ట‌. ఇదే జ‌రిగితే… సీమ రాజ‌కీయాల్లో వైకాపా ప‌ట్టు బిగించిన‌ట్టే లెక్క‌. ఇక్క‌డ చంద్ర‌బాబు లెక్క త‌ప్పిన‌ట్టే అవుతుంది. ఇక ఫ్యూచ‌ర్‌లో నంద్యాల రాజ‌కీయం ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో!!