టీడీపీలో న‌ల్లారి ఫ్యామిలీ క‌థ అడ్డం తిరుగుతుందా..!

కాలం క‌లిసి రాక‌పోతే.. అధికార పార్టీలో ఉన్నా.. ఎవ‌రు ఎంత గ‌ట్టిగా ప్ర‌య‌త్నించినా ఫ‌లితం మాత్రం శూన్యం! వీరిని చూస్తే జాలి క‌ల‌గ‌క మాన‌దు! ఇప్పుడు న‌ల్లారి ఫ్యామిలీ వ్యూహాలను గ‌మ‌నిస్తే ఇలాగే అనిపిస్తుంది. రాజ‌కీయాల్లో యాక్టివ్ అవ్వాల‌ని న‌ల్లారి సోద‌రులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. స‌మైక్యాంధ్ర మాజీ సీఎం న‌ల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోద‌రుడు న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే టీడీపీలో చేరినా.. వారికి విజ‌యం సాధించడం మాత్రం అంద‌ని ద్రాక్షే అని విశ్లేష‌కుల అభిప్రాయం! అంతేగాక వారి రాజ‌కీయ భ‌విష్య‌త్తు కూడా ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేషిస్తున్నారు.

మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి.. ఇప్పుడు టీడీపీ వైపు అడుగులేస్తున్నారు. ముందుగా ఆయ‌న సోద‌రుడు త‌ర్వాత ఆయ‌న సైకిలెక్కే సూచ‌న‌లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా ఆయ‌న త‌మ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి.. రేపో మాపో ప‌సుపు కండువా క‌ప్పుకోనున్నారు. అంతేగాక వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజంపేట ఎంపీ టికెట్ కావాల‌ని కోర‌గా, టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా ఇందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశార‌ట‌. అయితే అక్క‌డ గెలుపు మాత్రం న‌ల్లేరుపై కాద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది, ఎందుకంటే క‌డప జిల్లా రాజంపేట వైసీపీకి ఎప్ప‌టినుంచో కంచుకోట‌.

రాజంపేట టికెట్ కిషోర్ కుమార్ రెడ్డికి కేటాయించ‌డం వెనుక బాబు మార్క్ ఉంద‌ట‌. రాజంపేట‌లో పెద్ది రెడ్డి ఫ్యామిలీతో రాజకీయ వైరాన్ని కలిగిన నల్లారి కుటుంబాన్ని రంగంలోకి దించాలని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. గ‌త సార్వత్రిక ఎన్నికల్లో `జై స‌మైక్యాంధ్ర‌` పార్టీ త‌ర‌ఫున‌ పీలేరు నుంచి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేశాడు. కానీ ఆ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయాడు. ఇందులో పెద్దిరెడ్డి కీల‌క పాత్ర పోషించాడు. వైకాపా అభ్య‌ర్థి చింతల మంచి మెజారిటీతో నే ఆయన గెలిచాడు. ముఖ్యమంత్రి గా అన్న ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచినే కిరణ్ తమ్ముడు సత్తా చాటలేకపోయాడు.

ప్రస్తుతం రాజంపేట వైసీపీకి పెట్ట‌ని కోట‌. ఎంపీ ప‌రిధిలో మూడు నియోజ‌క‌వ‌ర్గాలు క‌డ‌ప జిల్లాలోనే ఉన్నాయి. దీంతో కిషోర్‌కుమార్ రెడ్డి అక్క‌డి నుంచి ఎంపీగా పోటీచేసినా గెలుపు అంత సులువు కాద‌నేది వాస్త‌వం! మ‌రి ఇటువంటి స‌మ‌యంలో టీడీపీలో చేరి.. గెల‌వ‌క‌పోతే వారి రాజ‌కీయ భ‌విష్య‌త్తు దాదాపు ముగిసిన‌ట్టే అవుతుంది. మ‌రి చంద్ర‌బాబుపై న‌మ్మ‌కంతో వారు త‌మ భ‌విష్య‌త్తునే రిస్క్ చేసి రంగంలోకి దిగిన‌ట్టే తెలుస్తోంది!