కేసీఆర్‌ సర్వేలకే సవాలు విసురుతున్న తెరాస ఎమ్మెల్యేలు

టీఆర్ఎస్‌ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆ పార్టీ ఎమ్మెల్యేల‌కు కంటి నిండా నిద్ర క‌రువవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ నిర్వ‌హిస్తున్న స‌ర్వేలు.. వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ స‌ర్వే జ‌రుగుతుందో… అందులో తాము ఎక్క‌డ ఉంటామో తెలియ‌క అంతా స‌త‌మ‌త‌మైపోతున్నారు. ఇక ఈ స‌ర్వే ఫ‌లితాలే 2019 ఎన్నిక‌ల్లో సీటు ఇచ్చేందుకు కొల‌మాన‌మ‌ని చెబుతుండ‌టంతో.. ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్ మొద‌లైంది. `పార్టీ ప‌రిస్థితి బాగుంది.. కానీ ఎమ్మెల్యేల ప‌రిస్థితి బాలేదు` అని సీఎం చెబుతుండ‌టంతో.. ఎక్క‌డ బెడిసికొట్టిందా అని తెగ ఆలోచించేస్తున్నార‌ట‌.

అందుకే సీఎం స‌ర్వేకు ధీటుగా.. త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ కౌంట‌ర్ స‌ర్వే నిర్వ‌హిస్తున్నార‌ట‌.

కేసీఆర్‌ ఏకంగా ఏడాదిలోనే రెండు సార్లు సర్వే చేయించారు. ఈ ఫలితాలను గత నెల 9వ తేదీన తెలంగాణభవన్‌లో జరిగిన టీఆర్‌ ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో వెల్లడించి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో వివరిం చారు. ఈ సందర్భంలోనే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని ఆయన ప్రకటిం చినా.. సర్వేలో మార్కులు, ర్యాంకులు తక్కు వగా వచ్చిన ఎమ్మెల్యేలు మాత్రం నిద్రపోలేక పోతున్నారని చెబుతున్నారు. తాము కష్టపడి పనిచే స్తున్నా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నా ఇలా ఎందుకు జరిగిందన్న అంశంపై ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైందని పేర్కొంటున్నారు.

పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు ఇలా తక్కువ ర్యాంకు వచ్చిన ఎమ్మెల్యేలు పలువురు సొంతంగా సర్వేలు చేయించుకునే పనిలో పడ్డారు. సిట్టింగులకే మళ్లీ టికెట్లు అని చెబుతున్నా, తీరా ఎన్నికల ముందు టికెట్ ఇవ్వ‌క‌పోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని ముందుగానే జాగ్రత్త పడుతున్నార‌ట‌. తమ పనితీరుపై స్వయంగా అంచనాకు వచ్చేందుకు వీరు సొంత సర్వేలపై ఆధారపడుతున్నారు. దీంతో తాము సొంతంగా సర్వేలు చేయించుకుని..ఆ ఫలితాలతో సీఎం సర్వే ఫలితాలను బేరీజు వేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

‘అసలు ఎక్కడ బలహీనంగా ఉన్నాం? ప్రజలకు చేరువ కావటంలో ఎక్కడ తేడా వచ్చింది? సీఎం కేసీఆర్‌ చేస్తున్న సర్వేల్లో మార్కులు ఎందుకు తక్కువగా వచ్చాయి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటేగానీ మెరుగుపడలేం. అయినా నిజాలు తెలుసుకోవాలి కదా..’ అని ఎమ్మెల్యేలు వ్యాఖ్య‌నిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ మళ్ళీ సర్వే చేసే నాటికి తమ పరిస్థితిని మెరుగుపరుచుకోవడం ద్వారా మంచి ర్యాంకు తెచ్చుకునేందుకే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మ‌రి వారి స‌ర్వేల్లో ఎలాంటి వ‌స్తాయో? మ‌రి గ్యాప్ ఎక్క‌డ ఉందో తెలుసుకుని మెరుగుప‌డ‌తారో లేదో!!