2019కి టీడీపీలో సీనియ‌ర్లు అవుట్‌

తెలుగు దేశం పార్టీని త‌మ భుజ స్కందాల‌పై మోసి.. ఈ స్థాయికి చేర్చిన సీనియ‌ర్ల శ‌కం ఇక ముగిసిన‌ట్టే అనే గుస‌గుస‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. సీఎం చంద్ర‌బాబు కూడా వీరికి ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టీడీపీలో యువ నాయ‌క‌త్వం పెర‌గ‌బోతోంద‌నే సంకేతాలు.. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ద్వారా స్ప‌ష్టం చేశారు చంద్రబాబు! అంతేగాక 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి అంతా చిన‌బాబు లోకేష్ సార‌థ్యంలోకే వెళ్ల‌వ‌చ్చ‌నేది కూడా స్ప‌ష్ట‌మ‌వుతున్న త‌రుణంలో.. ఇక సీనియ‌ర్ల‌కు ఉద్వాస‌న త‌ప్ప‌ద‌నే సంకేతాలు స్ప‌ష్ట‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా ఇందుకు బ‌లం చేకూరుస్తున్నాయి.

ఏపీలో మంత్రివర్గ విస్తరణ తీరు చూస్తూంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు రిటైర్‌మెంట్‌ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో వారిని పూర్తిగా పక్కన పెట్టేందుకు పూర్వరంగాన్ని సిద్ధం చేసినట్లుగా తాజా కూర్పును బట్టి అర్ధమవుతోంది. శ్రీకాకుళం జిల్లా సీనియర్‌ నేత గౌతు శ్యామసుందర శివాజీ ఒక్క ఛాన్స్ అని ప్రాధేయపడినా పార్టీ నాయకత్వం క‌రుణించ‌లేదు. దాంతో, ఆయన 2019 నాటికి రాజకీయాల నుంచి రిటైర్‌ కావడం అనివార్యమవుతోంది.

శ్రీకాకుళం జిల్లాలో 2019 నాటికి తమ అనుచర గణం పెరగాలన్న ఉద్దేశంతో మంత్రులను లోకేష్‌ ఎంపిక చేసుకున్నారని టాక్‌. దానిలో భాగంగానే అచ్చెంనాయుడు, కళాలను మంత్రులు చేశారని తెలుస్తోంది.

ఇక విజయనగరం జిల్లాలో ఎంపీ అశోక్‌గజపతిరాజు సైతం 2019 నాటికి పదవీ విరమణ చేయక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. మంత్రివర్గ విస్తరణలో ఆయ‌న‌తో వైరం ఉన్న బొబ్బిలి రాజులకు పట్టం కట్టిన వైనం చూస్తే రాబోయే రోజుల్లో బొబ్బిలి వంశస్థులే జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పగలరని తెలుస్తోంది. విశాఖ జిల్లాలో లోకేష్‌ కోటరీలో ఉన్న సీనియర్‌ మంత్రి అయ్యన్నపాత్రుడుకు మంత్రి పదవి కొనసాగించినా అంతగా ప్రాధాన్యత లేని రోడ్లు భవనాల శాఖను ఆయనకు కట్టబెట్టారు. ఈ పర్యాయంతో ఎన్నికల రాజకీయాల నుంచి పక్కకు తొలగాలని అయ్యన్న భావిస్తున్నారని టాక్‌. ఆయన తనయుడు లోకేష్ దృష్టిలో ఉండడంతో అయ్యన్న ఇకపై తెర వెనకకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఇదే జిల్లాలో రెండవ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు కాపుల ఉద్యమం దృష్ట్యా ప్రాధాన్యత ఇచ్చినా.. పార్టీ పట్ల ఆయన విధేయతపై ఇంకా సందేహాలు ఉన్నాయ‌ట‌. ఆయనకు చెక్‌ పెట్టేందుకే అదే సామాజికవర్గానికి చెందిన కళాను తెచ్చి.. మరీ మంత్రిని చేయడమే కాదు, కీలకమైన శాఖను కూడా అప్పగించారని టాక్‌. 2019 నాటికి టీడీపీ సీనియర్లు ఎన్నికల గోదాలోనే కనిపించకపోవచ్చునని, లోకేష్‌ టీమ్‌ పేరుతో కొత్త ముఖాలు రంగ ప్రవేశం చేయవచ్చనేది విశ్లేష‌కుల అంచ‌నా!!