పెద్ద‌ల ఆశ‌ల‌కు బీజేపీ నేత‌ల‌ గండి

తెలంగాణ బీజేపీలో లుక‌లుక‌లు బ‌య‌టప‌డ్డాయి. ఆధిప‌త్య పోరు ఇప్పుడు ఆ పార్టీని వేధిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీని ప‌రుగు పెట్టించాల్సిన ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య అభిప్రాయ‌బేధాలు పార్టీ అధిష్ఠానానికి త‌ల‌నొప్పిగా మారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.ల‌క్ష్మ‌ణ్‌, శాస‌నాస‌భా ప‌క్ష నేత కిష‌న్ రెడ్డి కేంద్రాలుగా రెండు ప‌వ‌ర్ హౌస్‌లు ఏర్ప‌డుతు న్నాయ‌ని అంత‌ర్గ‌తంగా చ‌ర్చ న‌డుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో బీజేపీని బ‌లోపేతం చేయాల‌ని అధిష్ఠాన పెద్ద‌లు ఆశ‌లు పెట్టుకుంటే.. వీరు ఆ ఆశ‌ల‌కు గండి కొడుతున్నారు. వీరి విభేదాల వ‌ల్ల పార్టీ మ‌రింత బ‌ల‌ప‌డ‌క‌పోగా.. తీవ్ర న‌ష్టం వాటిల్లే ప్ర‌మాద‌ముంద‌ని పార్టీ వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని బీజేపీ అధిష్ఠానం పావులు క‌దుపుతోంది. అయితే, ఇదే స‌మ‌యంలో కీల‌క‌మైన కిష‌న్ రెడ్డి, లక్ష్మ‌ణ్ ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు మొద‌లైందని తెలుస్తోంది. ఎవ‌రికి వారు పార్టీలో త‌మ ప‌ట్టును ప్ర‌ద‌ర్శించుకునేందుకు, ఆధిప‌త్యాన్ని చాటి చెప్పుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తాజా ఘ‌ట‌న‌లు చెబుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా డాక్ట‌ర్ కె. ల‌క్ష్మణ్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన ద‌గ్గ‌ర నుంచీ వీరి మ‌ధ్య లుక‌లుక‌లు ప్రారంభ‌మ‌య్యాయని తెలుస్తోంది. ఇటీవ‌ల‌ ల‌క్ష్మ‌ణ్ జిల్లాల్లో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇలా త‌న బ‌లం పెంచుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇంకోప‌క్క‌.. కిష‌న్ రెడ్డి కూడా సింగ‌రేణి ప్రాంతంలో ప‌ర్య‌ట‌న చేసి, త‌న ప‌ట్టు నిలుపుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. పార్టీ నాయ‌కులు ఏయే ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తారో అనేది ముందుగా త‌న‌కు తెలియాంటూ ల‌క్ష్మ‌ణ్ అన్నార‌ట‌! ఎవ‌రికివారు సొంత అజెండాల‌తో ప‌ర్య‌ట‌న‌లు చేసుకుంటే ఎలా అని కిష‌న్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న ర‌ద్దైన సంద‌ర్భంలోనూ వీరి మ‌ధ్య విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యిన వెంట‌నే రాష్ట్ర నేత స‌మావేశం ఏర్పాటు చేస్తే.. దానికి కిష‌న్ రెడ్డి హాజ‌రు కాలేదు. అలాగే, పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం నాడు కూడా వీరి మ‌ధ్య లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయ‌నీ అంటున్నారు.

ఆ కార్య‌క్ర‌మానికి కిష‌న్ ను ఆహ్వానించినా, ఆయ‌న కోసం కాసేపైనా వేచి చూడకుండా వేడుక‌లను ల‌క్ష్మ‌ణ్ నిర్వ‌హించేశార‌ట‌. దాంతో అసంతృప్తికి గురైన కిష‌న్ రెడ్డి, మ‌రో కార్య‌క్ర‌మానికి వెళ్లిపోయార‌ట‌. దీంతో తెలంగాణ భాజ‌పా రెండు గ్రూపులుగా విడిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. రాష్ట్రంలో పార్టీని బ‌లోపేతం చేయాల్సిన ఈ త‌రుణంలో ఆధిప‌త్య పోరు తెర‌మీదికి రావ‌డం స‌రైంది కాదంటూ ఆ పార్టీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ విష‌యంలో అధ‌ష్ఠానం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే!!