ఆర్‌కే న‌గ‌ర్‌లో గెలుపు వారిదే..

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త జ‌య‌ల‌లిత నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆర్కే న‌గ‌ర్‌లో గెలుపు కోసం డ‌బ్బులు విచ్చ‌ల విడిగా ఖ‌ర్చుచేస్తున్నాయి రాజ‌కీయ పార్టీలు! అటు అన్నాడీఎంకే, ఇటు దీప వ‌ర్గం, ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం, డీఎంకే, బీజేపీ, ఇలా ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఇక్క‌డ గెలుపు ప్ర‌తిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో గెలుపు ఎవ‌రిని వ‌రించ‌బోతోందనే అంశంపై నిర్వ‌హించిన స‌ర్వేలో షాకింగ్ రిజ‌ల్ట్ వ‌చ్చింది. ఈ ఎన్నిక‌లో డీఎంకే విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని అందులో తేలింద‌ట‌.

అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌ నియోజకవర్గంలో సూర్యుడే ఉదయించబోతున్నాడ‌ని లయోలా కళాశాల మాజీ విద్యార్థులు నిర్వహించిన సర్వేలో వెల్ల‌డైంది. అన్నాడీఎంకేలో ముఠాపోరుతో తలలు పట్టుకుంటున్న ఆ పార్టీ కార్యకర్తలు విసిగివేసారి పోయి డీఎంకేకు జైకొట్టాలని నిర్ణయించేసుకున్నార‌ని బహిర్గ‌త‌మైంది. ఈ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే వైపే అక్కడి ప్రజలు మొగ్గు చూపుతున్నారని తేలింది. ఈ విద్యార్థులు ప్రజా సంస్కృతీ మండలి పేరుతో ఓ సంస్థను నడుపుతూ ఎన్నికలలో సర్వేలు నిర్వహిస్తుంటారు.

ఈ స‌ర్వే ప్ర‌కారం డీఎంకేకు 49.25 శాతం, అన్నాడీఎంకే (పురట్చితలైవి అమ్మ)కు 18.45 శాతం, అన్నాడీఎంకే (అమ్మ)కు 15.50 శాతం, దీపాపేరవైకి 4.58 శాతం, బీజేపీకి 1.37 శాతం, డీఎండీకేకు 2.20 శాతం, నామ్‌ తమిళర్‌ కట్చికి 2.18 శాతం, సీపీఎంకు 1.22 శాతం మంది ఓటర్లు మద్దతు ప్రకటించారని తెలిపారు. ఇక ప్రస్తుతమున్న అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసా గాలా వద్దా అనే ప్రశ్నకు ఆ నియోజకవర్గంలోని ఓటర్లలో 59.2 శాతం మంది తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు జరిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని అభిప్రాయపడ్డారు. 37.8 శాతం పళనిస్వామి ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలన్నారు.

ఇక మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కారణమేమిటన్న ప్రశ్నకు ఆ నియోజకవర్గంలోని ఓటర్లలో 73.8 శాతం మంది ఆమె సన్నిహితురాలు శశికళ కారణమని ఆరోపించినట్టు తిరునావుక్కరసు తెలిపారు. అన్నాడీఎంకే రెండువర్గాలుగా పోటీ చేయడం, ఈ పార్టీలకు తోడుగా జయ సోదరుడి కుమార్తె దీపా కూడా రంగంలోకి దిగడంతో అన్నాడీఎంకే ఓటు బ్యాంకు మూడు విభాగాలుగా చీలిపోయిందని, ఈ వ్యవహారం ఆ పార్టీ అభ్యర్థిని దెబ్బతీయబోతోందని అంచనా వేశారు. మ‌రి ఇవి ఎంత‌వ‌రకూ నిజమో గాని.. ఇది మాత్రం డీఎంకేకి కిక్ ఇచ్చే అంశ‌మే!!