తెలంగాణ‌లో బీజేపీతో అంట‌కాగితేనే టీడీపీకి లైఫ్‌!

దాదాపు మూడున్నర ద‌శాబ్దాల‌కు పైగా తెలుగు నాట అప్ర‌తిహ‌తంగా చ‌క్రం తిప్పిన తెలుగు దేశం పార్టీ.. రాష్ట్ర విభ‌జ‌న‌, తెలంగాణ ఉద్య‌మం దెబ్బ‌తో ప్ర‌స్తుతం విల‌విల‌లాడిపోతోంది! ఏపీలోని 13 జిల్లాల్లో అధికారం చేప‌ట్టి చ‌క్రంతిప్పుతున్నా.. అదే తెలంగాణ‌లో ప‌రిస్థితి మాత్రం అత్యంత దారుణంగా మారింది. హైద‌రాబాద్‌ని నేనే అభివృద్ధి చేశాన‌ని, తెలంగాణ‌లో త‌న ముద్ర శాశ్వ‌త‌మ‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీడీపీ ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మారిన నేప‌థ్యంలో క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఏపీలో అధికారంలో ఉన్న చంద్ర‌బాబు, ఇటీవ‌ల ఆయ‌న తన‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌ను కూడా ఏపీ మంత్రి వ‌ర్గంలో చేర్చుకున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ‌లో టీడీపీ నేత‌ల‌కు కేరాఫ్ లేకుండా పోయింది. త‌మ క‌ష్టాలు ఎవ‌రికి చెప్పుకోవాల‌ని, ఎవ‌రితో క‌లిసి వ్యూహాలు ర‌చించాలి? అధికార టీఆర్ ఎస్‌ను ఎలా నిలువ‌రించాలి? వ‌ంటి అనేక ప్ర‌శ్న‌లు ఇప్పుడు తెలంగాణ టీడీపీ నేత‌ల మెద‌ళ్ల‌ను క‌ద‌లిస్తున్నాయి. మ‌రోప‌క్క 2019 ఎన్నిక‌లకు ప‌ట్టుమ‌ని రెండేళ్ల స‌మ‌యం కూడా లేక‌పోవ‌డం, పార్టీని సంస్థాగ‌తంగా డెవ‌ల‌ప్ చేసుకోవాల్సి ఉండ‌డం వీరికి మింగుడు ప‌డ‌డంలేదు.

ఇదిలావుంటే, ఇప్ప‌టికే టీడీపీ తెలంగాణ‌లో ప‌లచ‌బ‌డింది. బ‌డా నేత‌లంతా కేసీఆర్ స‌మ‌క్షంలో కారెక్కేశారు. ఇక‌, ఉన్న కొద్దిపాటికీ స్వ‌తంత్రం క‌రువైంది. పోనీ అధినేత చంద్ర‌బాబు ఏమైనా తెలంగాణ ప‌రిస్థితుల‌ను ప‌ట్టించుకుంటారా? అంటే అదీలేదు. ఆయ‌న ఏపీలోనే బిజీబిజీ. ఒక్క‌నిముషం స‌మ‌యం కూడా తెలంగాణ నేత‌ల‌కు కేటాయించ‌డం లేదు. దీంతో ఇక్క‌డి నేత‌ల ప‌రిస్థితి కుడితిలోప‌డ్డ ఎలుక‌లా త‌యారైంది. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఏపీలో మాదిరిగా బీజేపీతో జ‌ట్టుక‌ట్టి జ‌నాల్లోకి వెళ్ల‌డ‌మే మంచిద‌ని నేత‌లు భావిస్తున్నారు.

అయితే, బీజేపీ మాత్రం ఏపీలో ప‌రిస్థితి మాకు తెలియ‌దు.. తెలంగాణ‌లో మాత్రం మేం టీడీపీతో జ‌ట్టుక‌ట్టేది లేద‌ని తెగేసి చెబుతున్నాయి. కానీ, చంద్ర‌బాబు మౌనం వెనుక‌.. టీడీపీని బీజేపీతో జ‌త‌క‌ట్టి.. 2019లో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. రాజ‌కీయాల‌న్నాక ఈక్వేష‌న్స్ ఎలాగైనా, ఎప్పుడైనా మారోచ్చు. ఇక‌, దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డి సైతం.. త‌న‌కు ఏదైనా మంచి ఆఫ‌ర్ ఇచ్చే పార్టీ ఉంటే బావుణ్ను అని ఎదురు చూస్తున్నాడ‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.