కాంగ్రెస్ వాస‌న‌లు మ‌రిచిపోని చంద్ర‌బాబు

కాంగ్రెస్‌, తెలుగుదేశం.. రెండూ విరుద్ధ స్వ‌భావాలు గ‌ల పార్టీలు! కానీ ప్ర‌స్తుతం ఈ రెండు పార్టీల్లో ఒకటే సంస్కృతి న‌డుస్తోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్న‌డూ లేని రీతిలో తెలుగుదేశం పార్టీలో అస‌మ్మ‌తివాదులు పెరుగుతున్నారు. ఒక‌ప్పుడు పార్టీపైనా, అధినేత‌పైనా విమ‌ర్శ‌లు చేయ‌డానికి ధైర్యం చేయ‌ని నేత‌లు.. ఇప్పుడు త‌మ అసంతృప్తిని బాహాటంగానే వెళ్ల‌గ‌క్కుతున్నారు. ఈ సంస్కృతి ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉండేద‌ని విశ్లేష‌కులు గుర్తుచేస్తున్నారు. ఎన్టీఆర్ ఉన్న హ‌యాంలో కిక్కురుమ‌నేవారు కాద‌ని.. చంద్ర‌బాబు హ‌యాంలో పార్టీపై విమ‌ర్శ‌లు చేసే స్థితికి ప‌రిస్థితి దిగ‌జారింద‌ని చెబుతున్నారు. కాంగ్రెస్ సంస్కృతిని బాబు పెంచిపోషిస్తున్నార‌ని విమర్శిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ చేతిలో పార్టీ నడిచినన్నాళ్లు విమర్శలు చేయాలంటే జంకే పరిస్థితి. ఆయ‌న ఏ నిర్ణ‌యం తీసుకున్నా దానికి ఎదురు ఉండేది కాదు. కానీ ఇప్పుడు నిత్యం అసమ్మతి నాయకులతోనూ, క్రమశిక్షణారాహిత్యంతోనూ కుంగిపోతోంది. ఒక మంత్రిని తీసేయాలన్నా…మరొకరికి పదవి ఇవ్వాలన్నా…అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నా పార్టీ అధ్యక్షుడు జంకే పరిస్థితి. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌తో పార్టీలో జ‌రిగిన ర‌చ్చ చూసిన కార్య‌క‌ర్త‌లు, విశ్లేష‌కులు అవాక్క‌వుతున్నారు. ఇదంతా చంద్రబాబు వల్లే అని కుమిలిపోతున్నారు.

తనలో 30శాతం కాంగ్రెస్‌ రక్తం ఉందన్న చంద్రబాబు…టీడీపీలో కాంగ్రెస్‌ సంస్కృతిని పెంచిపోషిస్తున్నారని వారు వాపోతున్నారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోగేసుకున్న చెత్తతో టీడీపీలో క్రమశిక్షణారాహిత్యం మరింత దిగజారిపోయిందని అభిప్రాయపడుతున్నారు. నిత్యం అధినేతపై, ఆయన కుమారునిపై విమర్శలు గుప్పిస్తున్న నాయకులు ఒక వైపు… పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు అనుభవిస్తూ కోవర్టులుగా మారిన నాయకులతో.. కాంగ్రెస్‌ పార్టీని గుర్తు తెస్తోందని రాజకీయ విశ్లేషకులు వివ‌రిస్తున్నారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో చంద్రబాబుకు చాలా మంది నాయకులు సన్నిహితులుగా మారారు.

పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే డబ్బు కావాలని, అందుకోసం కొందరు స్థితిమంతులైన పారిశ్రామిక వేత్తలను పార్టీలో కీలక పాత్ర వహించారు చంద్ర‌బాబు! దీంతో కొంతమంది నేతలు చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి చేరుకున్నారు.పార్టీ క్రమశిక్షణను కట్టుతప్పారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాంగ్రెస్‌పార్టీ తరహ రాజకీయాలు ఊపందుకున్నాయి. పార్టీలో నేతలకు స్వేచ్చ లభించినట్లయింది. పార్టీ భవిష్యత్తు కన్న తమ తమ ఆర్థికప్రయోజనాలే ముఖ్యమన్న రీతిలో సాగుతున్నారు. మరి కాంగ్రెస్ సంస్కృతిని ఇప్ప‌టికైనా బాబు వ‌దిలిపెడ‌తారో లేదో వేచిచూడాల్సిందే!!