వైసీపీ టార్గెట్‌గా చంద్ర‌బాబు వ్యూహం… ఏ మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి !

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో తొలిసారి జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల‌కు అధికార టీడీపీ ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ప్ర‌తిప‌క్షం వైసీపీ నేత‌ల ఎత్తుల‌ను అంతేస్థాయిలో చిత్తు చేసేలా వ్యూహం ర‌చిస్తోంది. సుమారు రెండున్న‌రేళ్ల పాల‌న పూర్త‌యిన నేప‌థ్యంలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తే అవ‌కాశం ఉంది. ఉద్దానం కిడ్నీ మ‌ర‌ణాలు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఆక్వాపార్కు త‌దిత‌ర ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబును ఇరుకున పెట్టేందుకు జ‌గ‌న్ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహం సిద్ధం చేసింది. దీనికితోడు రోజా విష‌యం పెద్ద చ‌ర్చ‌కు దారితీయ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆయా విమ‌ర్శ‌ల‌ను త‌గిన విధంగా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధ‌మైంది.

వాస్త‌వానికి టీడీపీలో వైసీపీని టార్గెట్ చేసే వాళ్లు చాలా త‌క్కువ మందే ఉన్నారు. అటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేల్లో కేవ‌లం న‌లుగురైదుగురు మాత్ర‌మే వైసీపీని ముఖ్యంగా జ‌గ‌న్‌ని పూర్తిస్థాయిలో టార్గెట్ చేసుకుని ఏకేస్తున్నారు. బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి,మంత్రి దేవినేని ఉమా వంటి కొద్ది మందే ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీని ఇరుకున‌పెడుతూ విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. అయితే, ఈ ద‌ఫా అలా కాకుండా సాధ్య‌మైనంత వ‌ర‌కు ఎక్కువ మంది వైసీపీపై విరుచుకుప‌డేలా చంద్ర‌బాబు ప్లాన్ చేశారు.

ఈ నేప‌థ్యంలో దాదాపు 40 మంది టీడీపీ ఎమ్మెల్యేల‌కు పెద్ద ఎత్తున శిక్ష‌ణ ఇస్తున్నారు. వీరి శిక్ష‌ణా కార్య‌క్ర‌మం ఆదివారం గుంటూరులో ప్రారంభ‌మైంది. ముందుగా అనుకున్న‌ప్లాన్ ప్ర‌కారం ఆదివారం రోజంతా వారికి శిక్ష‌ణ సాగాల్సి ఉంది. అయితే, భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో దీనిని వాయిదా వేశారు. ఇక‌, అసెంబ్లీ జ‌రిగే స‌య‌మంలోనూ మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల నుంచి ఆరు గంట‌ల వ‌రకు శిక్ష‌ణ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. స‌భ‌లో వైసీపీ ఆరోప‌ణ‌ల‌ను ఎంత ప‌దునుగా తిప్పికొట్టాలి? ఎలాంటి కౌంట‌ర్‌వేయాలి? వ‌ంటి వాటితో పాటు వివిధ అంశాల‌పై గ‌ణాంకాల‌తో స‌హా వైసీపీని ఇరుకున పెట్ట‌డంపై వారికి పూర్తిస్థాయిలో శిక్ష‌ణ ఇస్తున్నార‌ట‌. మ‌రి చంద్ర‌బాబు వ్యూహం ఏ మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.

ఇక‌, ఇదే స‌మ‌య‌లో వైసీపీ శిబిరంలో మ‌రి ఇలాంటి శిక్ష‌ణ ఏమైనా ఉంటుందా? అంటే ప్ర‌స్తుతానికి జ‌గ‌న్ దానిపై ఎలాంటి దృష్టీ పెట్ట‌లేదు. సో.. జ‌గ‌న్ పార్టీ నుంచి కేవ‌లం ఎంపిక చేసిన వారు మాత్ర‌మే మాట్లాడేలా ప్లాన్ చేస్తున్నారు. ఎప్ప‌టిలాగానే ఎమ్మెల్యే రోజాను మ‌రోసారి ప్ర‌యోగించ‌నున్నారు. అయితే, ఈ సారి మాత్రం చాలా క‌న్‌స్ట్ర‌క్టివ్‌గా ఆమె మాట్లాడ‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మరి ఏం జ‌రుగుతుందో చూడాలి.