యూపీ ఎఫెక్ట్‌: తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు

యూపీ ఎఫెక్ట్ అన్ని రాష్ట్రాల‌పై ఎలా ఉంటుంద‌నే చ‌ర్చ ఇప్పుడు దేశమంతా మొద‌లైంది. ప్ర‌ధాని మోదీని ఢీ కొట్ట‌డం ఇక అసాధ్య‌మ‌న్న విష‌యం ఈ ఫ‌లితాల‌తో తేలిపోయింది. అందుకే ఇప్ప‌టినుంచే త‌మ వ్యూహాలు మార్చుకోవ‌డానికి సిద్ధ‌మవుతున్నారు నాయ‌కులు. ముఖ్యంగా దూర‌దృష్టిగ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా ఇప్పుడు యూపీ ప్ర‌భావం ప‌డింది. అందుకే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ముఖ్యంగా మోదీ హవా.. తెలంగాణ రాష్ట్రంపై ప‌డ‌కుండా ఉండేందుకు ప‌క్కా వ్యూహంతో దూసుకుపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల వ్యూహానికి తెర‌తీయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ న్యూస్ వైర‌ల్‌గా మారుతోంది.

మైండ్ గేమ్ కు, అంతుచిక్కని వ్యూహలకు పెట్టింది పేరైన గులాబీ అధినేత.. పక్కా ప్లానింగ్ ప్రకారమే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 2019 ఎన్నిక‌ల‌కు సెమీఫైన‌ల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌భంజ‌నం సృష్టించింది. ముఖ్యంగా ఉత్త‌రప్ర‌దేశ్‌లో 300 పైచిలుకు స్థానాలు ద‌క్కించుకుని జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. దీంతో అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల్లోనూ గుబులు మొద‌లైంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ భయం కేసీఆర్‌కు ప‌ట్టుకుంద‌ట‌. ఉత్తరప్రదేశ్ విజయం సీఎం కేసీఆర్ ను కలవరానికి గురి చేసిందట.

మోదీ ప్లాన్ ప్ర‌కారం దేశ‌వ్యాప్తంగా ఒకేసారి 2019లో ఎన్నిక‌లు జ‌రిగితే సీన్ సితారైపోతుంద‌ని కేసీఆర్ వర్రీ అవుతున్నారట. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత ప్లాన్ -బి ని మోదీ అమ‌లు చేస్తార‌ని భావిస్తున్న కేసీఆర్.. ముందుగానే ఎన్నిక‌లకు వెళితే తమకే మంచిదని అభిప్రాయపడుతున్నారట. ప్ర‌స్తుతం తెలంగాణలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను సంతోష‌పెట్టేలా టీఆర్ఎస్ పాల‌న సాగుతోంది. కేసీఆర్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అలాగే విప‌క్షాల్లో ఐక్య‌త లోపించ‌డం, త‌నను ఢీకొట్టే నాయ‌కులు లేక‌పోవ‌డం.. కేసీఆర్‌కు క‌లిసొచ్చింది, ఇంకా రెండేళ్ల‌లో ప‌రిస్థితులు మారిపోవ‌చ్చ‌ని… బీజేపీ బ‌లం పుంజుకోవ‌చ్చిన కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. అందుకే ఈ ముంద‌స్తు వ్యూహమ‌ట‌.

అలాగే 2018లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనుండడం కూడా మ‌రోకార‌ణ‌మ‌ట‌. ఈ ప్రభావం శాసనసభ ఎన్నికలపై ఎఫెక్ట్ చూపిస్తాయని.. అందుకే కేసీఆర్ ముందస్తు ఆలోచనకు సిద్ధమయ్యారని కమలనాథులు విశ్లేషిస్తున్నారు.

2019 ఎన్నిక‌ల వ‌ర‌కూ వేచి చూడకుండా.. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2017 చివరిలో కానీ, 2018 మొదట్లో కానీ ఎలక్షన్ వార్ కు వెళ్లే ప్లానింగ్ లో టీఆర్ఎస్ అధినేత ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మ‌రి కేసీఆర్ వ్యూహం ఫ‌లిస్తుందో లేదో!!