యూపీ గెలుపుతో మ‌రిన్ని బాదుడుల‌కు మోడీ సిద్ధ‌మా?!

ఇప్ప‌టికే వివిధ ప‌న్నుల‌తో సామాన్యుల న‌డ్డి విరుస్తున్న కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం రెండు రోజుల కింద‌ట అతి పెద్ద రాష్ట్రం యూపీలో సాధించిన అప్ర‌తిహ‌త విజయంతో మ‌రింత రెచ్చిపోయే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మెజారిటీ ఓ మాదిరిగా ఉంటే కొన్ని కీల‌క అంశాల్లో నిర్ణ‌యాలు తీసుకునేందుకు ఏ ప్ర‌భుత్వ‌మైనా వెనుకంజ వేయ‌డం త‌ప్పదు. కానీ, ఇప్పుడు యూపీ వంటి అతిపెద్ద రాష్ట్రంలో అనూహ్యంగా 325 స్థానాల‌ను కైవసం చేసుకున్న బీజేపీ నేత‌ల‌కు అంతా త‌మ‌దే అధికారం అనే ధోర‌ణి పెరిగే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు.

ముఖ్యంగా కేంద్రంలో మోడీ ప్ర‌భుత్వం అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకువ‌చ్చేందుకు రెడీగా ఉంది. అయితే, దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి మ‌ద్ద‌తు అవ‌స‌రం. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఏత‌ర ప్ర‌భుత్వాలు ఉండ‌డంతో ఆయా సంస్క‌ర‌ణ‌లపై సాహ‌సం చేసేందుకు మోడీ ప్ర‌భుత్వం వెనక్కి త‌గ్గింది. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో రెండు చోట్ల యూపీ, ఉత్త‌రాఖండ్‌లో బీజేపీకి స్ప‌ష్ట‌మైన మెజారిటీ వ‌చ్చింది. ఇక‌, గోవా, మ‌ణిపూర్‌ల‌లో పూర్తి మెజారిటీ రాక‌పోయినా.. చిన్నా చిత‌కా పార్టీల‌ను క‌లుపుకొని ప్ర‌భుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధ‌మైంది.

ఈ నేప‌థ్యంలో దేశంలోని 29 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత లేదా బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వాల పాలిత రాష్ట్రాల సంఖ్య భారీగానే ఉంది. దీనికి తోడు యూపీ వంటి పెద్ద రాష్ట్రంలో బీజేపీ ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా గెల‌వ‌డం మోడీ వంటి స్ట్ర‌యిట్ ఫార్వ‌ర్డ్ నేత‌ల‌కు అందివ‌చ్చిన అవ‌కాశంగా పేర్కొంటున్నారు విశ్లేష‌కులు. ఈ క్ర‌మంలో మోడీ త‌న సంస్క‌ర‌ణ‌ల క‌త్తికి మ‌రింత ప‌దును పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే న‌గ‌దు ర‌ద్దు ప్రపంచ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు బ్యాంకింగ్ రంగ సంస్క‌ర‌ణ‌ల‌కు కూడా మోడీ శ్రీకారం చుట్ట‌నున్నారు.

దీని ప్ర‌కారం బ్యాంకులో క‌నీస నిల్వ‌ల‌ను మెయిన్‌టెన్ చేయ‌డంతోపాటు న‌గ‌దు వేసినా.. తీసినా కూడా ప‌న్ను బాదే ప‌రిస్థితి రానుంది. ఇది సామాన్యుల‌కు శ‌రాఘాతం వంటి ప‌రిణామ‌మే. పెద్ద‌ల‌ను ప‌ట్టుకుంటామ‌ని చెప్పిన మోడీ పెద్ద నోట్ల ర‌ద్దుతో సామాన్యుల‌ను మాత్రం ముప్పు తిప్ప‌లు పెడుతున్నారు. ఇక‌పై ఈ ఆంక్ష‌లు ప‌న్నులు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంది. అదేవిధంగా ఎఫ్‌డీఐల విష‌యంలోనూ మోడీ ఎవ‌రి మాట‌నూ లెక్క చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే మోడీ ప్ర‌భుత్వం ఎఫ్‌డీఐల‌కు విస్తృత అవ‌కాశం క‌ల్పించింది. ఫ‌లితంగా దేశీయ చిన్న మార్కెట్లు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. ఈ నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో మోడీ ఎలాంటి నిర్ణ‌యాల‌తో విజృంభిస్తారో చూడాలి.