లోకేష్ ఆస్తి ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

దేశంలో తొలిసారి ఏ రాజ‌కీయ నాయ‌కుడు చేయ‌ని విధంగా.. ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న ఆస్తుల‌ను ఏటా ప్ర‌క‌టిస్తున్నారు. అంతేగాక త‌న కుటుంబ స‌భ్యుల ఆస్తుల వివ‌రాలు కూడా వెల్ల‌డిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఆయ‌న త‌న‌యుడు ప్ర‌క‌టించిన ఆస్తుల లెక్క‌పై అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేస్తున్నారు. 2016 లెక్క‌ల‌కు, తాజాగా ఆయన ఎమ్మెల్సీ అఫిడ‌విట్లో చూపిన లెక్క‌ల‌కూ.. న‌క్క‌కూ నాగ‌లోకానికి ఉన్నంత తేడా ఉండ‌టంతో.. విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అన‌తి కాలంలోనే అన్నిరెట్లు ఆస్తి ఎలా పెరిగిందోన‌ని సందేహాలు వ్య‌క్తంచేస్తున్నారు!! అస‌లు ఆ లెక్క క‌రెక్టేనా అని మ‌రికొంద‌రు ఆరా తీస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా.. త‌న పేరున గ‌ల ఆస్తుల వివ‌రాల‌ను నారా లోకేష్ స‌మ‌ర్పించారు. తన పేరు మీద ఉన్న ఆస్తుల విలువ రూ.217 కోట్లు అని అఫిడవిట్లో పేర్కొన్నారు. తన పేరుమీద హెరిటేజ్ షేర్లు ఇతర ఆస్తుల విలువ రూ.217 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. తన స్తిరాస్తుల విలువ రూ.9.95 కోట్లుగా వ్యవహరించారు. భార్య నారా బ్రాహ్మణి పేరు మీద రూ.17.90 కోట్లు విలువ చేసే షేర్లు ఉన్నట్లు ప్రకటించారు. భార్య స్థిరాస్థుల విలువ రూ.4.45 కోట్లు. ఇక‌ తనయుడు దేవాంశ్ పేరుమీద రూ.2.70 కోట్లు విలువ ఉన్న షేర్లు అతడి స్థిరాస్థులు రూ.9.60 కోట్లు విలువ ఉన్నట్లు ఆయన తన అఫిడవిట్లో స్పష్టం చేశారు.

అయితే.. ఏటా లోకేశే తమ కుటుంబ ఆస్తులను కూడా ప్రకటిస్తారు. 2016 అక్టోబరులో ఆయన తమ కుటుంబ ఆస్తులను ప్రకటించారు. ఆ సమయంలో ఆయన తన పేర మీద ఉన్న మొత్తం ఆస్తుల విలువ 14.50 కోట్లు అని స్వ‌యంగా వెల్ల‌డించారు. మరి కొద్దినెలల్లోనే ఇన్ని రెట్లు ఎలా పెరిగిందని అంటున్నారు. కేవలం అయిదు నెలల కాలంలోనే 15 రెట్లు పెరగడంపై ఆశ్చర్యంతో పాటు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మొత్తానికి ఇంత త‌క్కువ కాలంలో అంత‌లా ఆస్తులు ఎందుకు పెరిగాయో!!