కోదండరాం దెబ్బకి తెలంగాణ కాంగ్రెస్ లో చీలిక

తెలంగాణ‌లో ప‌రిచ‌యం అక్క‌ర‌లేని నేత ప్రోఫెస‌ర్ కోదండ‌రాం. తెలంగాణ ఉద్య‌మం నేప‌థ్యంలో మేధావులను క‌ద‌లించిన కంఠం ఆయ‌న‌ది. అయితే, రాష్ట్ర సాధ‌న అనంతరం ఆయ‌న రాజ‌కీయాల్లోకి వెళ్ల‌కుండా ప్ర‌జ‌ల ప‌క్షానే ప‌రిమితం అయ్యారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, ఉదాశీన‌త‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. కేసీఆర్‌ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి నేత అవ‌స‌రం కాంగ్రెస్‌కి వ‌చ్చింద‌ట‌. ప్ర‌స్తుతం నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కి ఓ బ‌ల‌మైన నేత అవ‌స‌రం అన్న‌ది ముమ్మాటికీ నిజం.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌పై దుమ్మెత్తి పోయ‌డం స‌హా పార్టీని ప్ర‌జ‌ల్లో బ్ర‌తికించుకునేందుకు కాంగ్రెస్‌లోని ఓ వ‌ర్గం ఇప్పుడు కోదండ రాంకి జై కొడుతోంది. అయితే, మ‌రో వ‌ర్గం మాత్రం మ‌నంత‌ట మ‌న‌మే ప్ర‌జ‌ల్లోకి వెళ‌దామ‌ని అంటోంది . దీంతో ఇప్పుడు కోదండ రాం విష‌యం కాంగ్రెస్‌లో చిచ్చు పెడుతోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. కోదండ‌రాం చెప్పేది ప్రజ‌లు న‌మ్మితే.. . అది కాంగ్రెస్‌కే లాభం అని ఆ పార్టీ నాయ‌కులు అనుకుంటున్నారు. ఈ విష‌యంలో ఉత్తమ్, జానారెడ్డి, భ‌ట్టి విక్రమార్క అంతా ఒకే అభిప్రాయంతో ఉన్నార‌ట‌.

కానీ పాల‌మూరు నేత‌లు మాత్రం ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నార‌ట‌. అస‌లు కోదండ‌రాంకు అంత ప్రాధాన్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అందుకే కొంత‌మంది కాంగ్రెస్ నాయ‌కులు కోదండ‌రాం కార్యక్రమాల్లో క‌నిపిస్తుంటే.. మ‌రికొంత‌మంది అస్సలు క‌నిపించ‌డం లేదు. పాత మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు డీకే అరుణ‌, సంప‌త్ కుమార్, వంశీచంద్ రెడ్డి, చిన్నారెడ్డి లాంటి వారంతా కోదండరాంకు మ‌ద్దతివ్వడం స‌రికాద‌ని వాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయ‌న‌కు సపోర్ట్ ఇవ్వడం కంటే… కాంగ్రెస్ పార్టీయే కొత్త కార్యక్రమాలు చేప‌ట్టడం మంచిద‌ని స‌ల‌హాలు ఇస్తున్నార‌ని స‌మాచారం. సో.. దీంతో ఇప్పుడు కోదండ రాం ఇష్యూ కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీస్తోంది.