లోకేశ్ ఎంట్రీతో ఆ ముగ్గురు మంత్రుల‌కు టెన్ష‌న్‌

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేశ్ కేబినెట్ ఎంట్రీకి ముహూర్తం ఖ‌రారైంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అవుతోన్న లోకేశ్ ఉగాది జ‌రిగే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బాబు కేబినెట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మైంది. ఇక మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో లోకేశ్‌కు ఏయే శాఖ‌లు ద‌క్కుతాయ‌న్న‌దానిపై జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ప్ర‌స్తుతం కొన్ని శాఖ‌ల‌ను చంద్ర‌బాబు ఎవ్వ‌రికి ఇవ్వ‌కుండా త‌న వ‌ద్దే ఉంచుకున్నారు. మౌలిక స‌దుపాయాల‌తో పాటు ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, సినిమాటోగ్ర‌ఫీ, న్యాయ‌శాఖ‌, ప‌ర్యాట‌క శాఖ‌లు ఉన్నాయి. ఈ శాఖ‌ల్లో కొన్ని శాఖ‌లు లోకేశ్‌కు ఇస్తే మంత్రివ‌ర్గంలో ఇత‌ర మంత్రుల శాఖ‌ల్లో పెద్ద‌గా మార్పులు-చేర్పులు ఉండ‌వు. అలా కాకుండా లోకేశ్ కోరుతున్న‌ట్టు మునిసిప‌ల్ & ఐటీ శాఖ‌లు ఇవ్వాల్సి వ‌స్తే మాత్రం కేబినెట్‌లో కొంద‌రు మంత్రుల శాఖ‌ల్లో కోత‌లు త‌ప్ప‌వు.

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మునిసిప‌ల్, ఐటీ శాఖ‌లు నిర్వ‌హిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు లోకేశ్ సైతం అవేశాఖ‌ల కోసం ప‌ట్టుబ‌డితే మునిసిప‌ల్ శాఖ నిర్వ‌హిస్తోన్న నారాయ‌ణ‌తో పాటు ఐటీ శాఖ నిర్వ‌హిస్తోన్న ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డి శాఖ‌ల‌కు కోత త‌ప్ప‌దు. ఇక కీల‌క‌మైన మాన‌వ వ‌న‌రుల శాఖ కావాల‌నుకుంటే నారాయ‌ణ వియ్యంకుడు అయిన గంటా శ్రీనివాస‌రావుకు షాక్ త‌ప్ప‌దు.

లోకేశ్ కేబినెట్ ఎంట్రీతో పాటు..శాఖ‌ల విష‌యంలో ఈ ముగ్గురు మంత్రులు లోప‌ల ఆందోళ‌న‌తోనే ఉన్న‌ట్టు టీడీపీ వ‌ర్గాల టాక్‌. ఇక లోకేశ్‌తో పాటు కొత్త‌గా 8 మంది మంత్రులు బాబు కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తార‌ని…ప‌నితీరు అధ్వానంగా ఉన్న 6-7 గురు మంత్రులు అవుట్ అవుతార‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఏపీ కేబినెట్ ప్రక్షాళ‌న వార్త‌లు ఈ నెలాఖ‌ర‌వ‌ర‌కు మీడియాలో ప్ర‌కంప‌న‌లు రేప‌డం ఖాయం.