యూపీలో గెలుపెవ‌రిది?  బెట్టింగుల జోరు!

దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు బెట్టింగ్ బంగార్రాజులు పెరిగిపోయారు. ప్ర‌స్తుతం ఐదు ద‌శ‌ల ఎన్నిక‌లు పూర్త‌యిన నేప‌థ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది? ఏ పార్టీ మెజారిటీ ఓట్లు సాధిస్తుంది? ఏ పార్టీ నేల మ‌ట్ట‌మ‌వుతుంది? ప్ర‌ధాని మోడీ హ‌వా ఏ మేర‌కు ప‌నిచేస్తుంది? అమిత్ మంత్రాంగం ఎన్ని సీట్లు, ఓట్లు రాలుస్తుంది? వ‌ంటి విష‌యాల‌పై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి. ఈ బెట్టింగులు రూ.కోట్ల‌లో సాగుతుండ‌డంతో దేశం దృష్టంతా ఇప్పుడు యూపీపైనే ప‌డింది.

వాస్త‌వానికి కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు యూపీనే అంద‌రూ ప్ర‌ధాన రాష్ట్రంగా భావిస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అసెంబ్లీలో 403, పార్ల‌మెంట్ లో 81 స్థానాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఈ రాష్ట్రంలో అత్య‌ధిక సీట్లు కైవసం చేసుకునేందుకు అన్ని పార్టీలూ ఎత్తుల మీద ఎత్తులు వేయ‌డం సాధార‌ణం. అదేవిధంగా ఇప్పుడు యూపీలో అధికారంలో ఉన్న ఎస్పీ, ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీఎస్పీలు హోరా హోరీ త‌ల‌ప‌డుతుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం కూడా యూపీలో మ‌రోసారి పాగా వేసేందుకు శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తోంది.

ఇక‌, కాంగ్రెస్ ఎన్నోకొన్ని సాధ్య‌మైనంత వ‌ర‌కు ఎక్కువ సీట్లు కైవసం చేసుకునేందుకు ఎస్పీతో జ‌త‌క‌ట్టింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌, బీజేపీల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు నోట్ల ర‌ద్దు అంశం బీజేపీకి వ్య‌తిరేకంగా మారుతుంద‌ని భావించినా.. ప్ర‌స్తుతం వివిధ రాష్ట్రాల్లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌లు బీజేపీకి ప‌ట్టంగ‌ట్టాయి. దీంతో ఇప్పుడు అధికార ఎస్పీ తిరిగి ప‌ట్టు సాధిస్తుందా? లేక మోడీ మేనియా ప‌నిచేస్తుందా? లేక బీఎస్ప్ బెహెన్ జీ.. అధికారంలోకి వ‌స్తుందా? అనే టాపిక్ జోరందుకుంది. మ‌రో రెండు రౌండ్ల ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న రాష్ట్రంలో ఈ ద‌ఫా హంగ్ త‌ప్ప‌ద‌ని ఇప్ప‌టికే ఎగ్జిట్ పోల్స్ చాటుతున్నాయి.