టీడీపీ లో ఎమ్మెల్సీ కోసం లేడీ లీడర్ల మధ్య ఆసక్తికర పోరు

ఏపీలో ఎమ్మెల్సీ సీట్ల కోసం అధికార పార్టీలో పోరు తీవ్రంగా ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థ‌ల కోటాలో చంద్ర‌బాబు వివిధ జిల్లాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశారు. ఇక మిగిలింద‌ల్లా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ సీట్లు ఎవ‌రికి వ‌స్తాయా ? అని అంద‌రూ ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. అసెంబ్లీలో ఉన్న లెక్క‌ల ప్ర‌కారం టీడీపీకి ఐదు సీట్లు గ్యారెంటీ. ఆరో సీటు కాస్త మ్యానేజ్ చేస్తే ద‌క్కించుకోవ‌చ్చు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు మ‌హిళ‌లెవ్వ‌రికి సీట్లు ఇవ్వ‌లేదు. దీంతో ఇప్పుడు వారంతా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఏపీ టీడీపీలో ఎమ్మెల్సీ సీటు కోసం లేడీ లీడ‌ర్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు జ‌రుగుతోంది. టీడీపీకి ఖ‌చ్చితంగా ద‌క్కే ఐదు స్థానాల్లో ఒక‌టి చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేశ్‌కు క‌న్‌ఫార్మ్ అయ్యింది.

మిగిలిన సీట్ల‌లో ఒక‌టి ప్ర‌కాశం జిల్లాకు చెందిన క‌ర‌ణం బ‌ల‌రాంకు ద‌క్కుతుందంటున్నారు. మిగిలిన మూడుస్థానాల్లో ఒక‌టి ఖ‌చ్చితంగా మ‌హిళ‌ల‌కు ద‌క్కుతుందంటున్నారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి పార్టీలో ఉంటోన్న సినీన‌టి క‌విత ఈ సారి త‌న‌కు ఎమ్మెల్సీ కావాల్సిందే అని గ‌ట్టి ప‌ట్టుబ‌డుతున్నారు. చంద్ర‌బాబు త‌న‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆమె ఇటీవ‌ల మీడియా ముందే వాపోయారు.

ఇక విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్‌, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధీమాతో ఉన్నారు. ఆమెకు గ‌తంలోనే గ‌వ‌ర్న‌ర్ కోటాలో రెండేళ్ల ఎమ్మెల్సీ వ‌చ్చినా నో చెప్పారు. ఇక చీరాల నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయి, ఇన్‌చార్జ్ ప‌ద‌వి కూడా వ‌దులుకున్న పోతుల సునీత కూడా తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

ప‌రిటాల ర‌వితో క‌లిసి త‌న భ‌ర్త పోతుల సురేష్ టీడీపీకి చేసిన సేవ‌ల‌ను ఆమె ఉద‌హ‌రిస్తున్నారు. ఇక మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభాభార‌తి సైతం త‌న ఎమ్మెల్సీ పోస్టును రెన్యువ‌ల్ చేయాల‌ని కోరుతున్నారు. దీంతో టీడీపీలో మ‌హిళా కోటాలో ఎమ్మెల్సీ ఎవ‌రికి ద‌క్కుతుందో చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు ఉత్కంఠ‌గానే ఉంది.