టీఆర్ఎస్ లో కొత్త ముసలం.. కెసిఆర్ పై ఫైర్ అయ్యిన మంత్రులు

తెలంగాణ ప్ర‌భుత్వం రెండు రోజుల క్రితం ఒకేసారి ఏకంగా 10 కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను భ‌ర్తీ చేసింది. ఈ 10 మంది చైర్మ‌న్ల‌లో 5 గురు మైనార్టీ వ‌ర్గానికే చెందిన వారు కావ‌డం విశేషం. అయితే ఈ నియామ‌కాల ప‌ట్ల టీఆర్ఎస్‌లో పెద్ద ముస‌లం మొద‌లైంది. వీరిలో చాలా మంది పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ‌ని వారితో పాటు అనామ‌కుల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని ముగ్గురు మంత్రులు మిన‌హా మిగిలిన వారంతా తీవ్ర‌స్థాయిలో అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారని తెలుస్తోంది.

కొంద‌రు మంత్రులైతే ఏకంగా డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ ఎదుటే నిర‌స‌న‌కు దిగార‌ని స‌మాచారం. ఐదుగురు మైనార్టీ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తుల‌కు కార్పొరేష‌న్ ప‌ద‌వులు ఇవ్వ‌డంతో మ‌హ‌మూద్ ఆలీ తెలంగాణ భ‌వ‌న్‌లోనే కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. అదే టైంలో అక్క‌డ‌కు వ‌చ్చిన కొంద‌రు పార్టీ నాయ‌కులు అనామ‌కుల‌కు ప‌ద‌వులు ఎలా ఇస్తార‌ని ఆయ‌న్ను నిల‌దీశారు.

ఈ 10 నామినేటెడ్ పోస్టుల విష‌యంలో ఖ‌మ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు హ‌వానే ఎక్కువుగా ప‌నిచేసిందన్న చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి. మంత్రి తుమ్మ‌ల త‌న జిల్లాకే అధికంగా నామినేటెడ్ పోస్టులు తీసుకెళ్లిపోయారు. మిగిలిన వారిలో మ‌హ‌మూద్ ఆలీతో పాటు క‌డియం చెప్పిన వారికి కొన్ని ప‌ద‌వులు వ‌చ్చాయి. దీంతో మిగిలిన మంత్రులు టీ కేబినెట్‌లో మంత్రులంటే తుమ్మ‌ల – మ‌హ‌మూద్ – క‌డియం మాత్ర‌మేనా..?  తాము మంత్రులం కామా ? అని ఫైర్ అవుతున్నారు.

అసంతృప్తితో ఉన్న మంత్రులంతా ఇప్ప‌టికే మంత్రి కేటీఆర్‌ను క‌లిసి ఈ విష‌య‌మై ఫిర్యాదు చేశార‌ట‌. ఈ ప‌ద‌వుల భ‌ర్తీలో నిజ‌మైన కార్య‌క‌ర్త‌లను విస్మ‌రించార‌నే వాద‌న‌తో ఆయ‌న కూడా ఏకీభ‌వించార‌ట‌. దీంతో టీఆర్ఎస్‌లో నామినేటెడ్ ప‌ద‌వులు విష‌యం మంత్రుల మ‌ధ్య పెద్ద ముస‌లం రేగేందుకు కార‌ణ‌మైంది. మరి ఇది ఎలా మ‌లుపులు తిరుగుతుందో చూడాలి.